Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు.. మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఉన్నట్టుండి జుట్టు రాలిపోయి ఆ ప్రాంతంలో చర్మం బయటకు కనబడుతుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అలర్జీ తగ్గగానే మళ్లీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీన్నే పేరుకొరుకుడు అంటారు. దీనిని వైద్య పరిభాషలో అలోపేషియా ఏరిమెటా అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరి అవుతుందేమో అని అపోహపడుతుంటారు. తలపై గుండ్రని నిర్ణీత స్థానంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నగా ఉండడాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు సమస్య జనాభాలోని 2 శాతం మందిలో కనబడుతుంది. ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
ఇది ఒక ఆటో ఇమ్యూనో డిసార్డర్. అంటే వెంట్రుకలకు వ్యతిరేకంగా వాటిలోనే యాంటీ బాడీస్ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న వారి గోళ్ల మీద గీతలు, గుంటలు ఉంటాయి. చిన్నా, పెద్దా అలాగే స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. పురుషుల్లో ఈ సమస్య తలపైనే కాకుండా గడ్డం, మీసంలో కూడా వస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వయసు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. వంశపారపర్యంగా కూడా పేనుకొరుకుడు సమస్య తలెత్తుతుంది. అయితే ఇది అంటు వ్యాధి కాదు. 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ వ్యాధి కనిపించదు.
ఈ సమస్యను కొన్ని చిట్కాలను వాడడం వల్ల నయం చేసుకోవచ్చు. ఇష్టానుసారంగా మందులు వాడడం వల్ల సమస్య తగ్గకపోగా దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది. ఏ చికిత్సా విధానమైనా చాలా ఓర్పుగా తగ్గే వరకు వైద్యున్ని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. పేనుకొరుకుడును తగ్గించే అద్భుతమైన మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు మాత్రం ఒకేలా ఉండవు. కొందరికి చాలా కొద్ది కాలంలోనే అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తాయి. మరికొందరికి మరికొంత సమయం పట్టవచ్చు. ఓపికగా ఉంటే 100 శాతం ఫలితాలను పొందవచ్చు. ఈ మందులకు సంబంధించి ఎటువంటి ఆహార నియమాలు ఉండవు. దుష్ప్రభావాలు కూడా ఉండవు. దీని కోసం వాము, వస, నల్ల జీలకర్రను సమపాళ్లల్లో తీసుకోవాలి.
వీటిని కుండ పెంకులో తీసుకుని పొయ్యి మీద పెట్టి నల్లగా మాడ్చాలి. తరువాత కొబ్బరి చిప్పలను కూడా నిప్పుల మీద వేసి నల్లగా మాడ్చాలి. ఆ మొత్తాన్ని కలిపి మెత్తగా నూరి ఆ మసికి తగినంత కొబ్బరి నూనెను కలిపి గంధంలా తయారు చేసుకోవాలి. ఆ గంధాన్ని పేను కొరుకుడు పై రాసి రెండు రోజులకు ఒకసారి తంగేడు ఆకులతో లేదా పెసర పిండితో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పేనుకొరుకుడు సమస్య తగ్గుతుంది. అలాగే నిమ్మరసానికి సమానంగా వెల్లుల్లి రసాన్ని కలిపి పేనుకొరుకుడు పై లేపనంగా రాస్తూ ఉంటే సమస్య తగ్గి ఆ ప్రాంతంలో వెంట్రుకలు ఉత్పన్నమవుతాయి. నేపాలి గింజల్లోని పప్పును నలగ కొట్టి ఆ పప్పును నిమ్మరసంతో అరగదీయాలి. ఈ మిశ్రమాన్ని పేనుకొరికిన చోట రాయడం వల్ల వెంట్రుకలు మళ్లీ తిరిగి వస్తాయి. ఈవిధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల పేనుకొరుకుడు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.