Besan Halwa : శనగపిండితో మనం రకరకాల చిరుతిళ్లతో పాటు తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. శనగపిండితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. శనగపిండితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో శనగపిండి హల్వా కూడా ఒకటి. శనగపిండి హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. నైవేధ్యంగా కూడా ఈ హల్వాను తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ హల్వాను తయారు చేయవచ్చు. తరుచూ బొంబాయి రవ్వ హల్వానే కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉండే ఈ శనగపిండి హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్నవివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బేసన్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, తరిగిన బాదం పప్పు – కొద్దిగా, తరిగిన జీడిపప్పు – కొద్దిగా, ఎండుద్రాక్ష – కొద్దిగా, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, పంచదార – ఒక కప్పు, కుంకుమపువ్వు – చిటికెడు, పసుపు – పావు టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
బేసన్ హల్వా తయారీ విధానం..
ముందుగా కళాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రైఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ముందుగా రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేగిన తరువాత శనగపిండి, పసుపు వేసి వేయించాలి. 3 నిమిషాలకొకసారి నెయ్యి వేసుకుంటూ కలుపుతూ వేయించాలి. ఇలా శనగపిండిని వేయిస్తూనే మరో గిన్నెలో నీళ్లు, పంచదార, కుంకుమపువ్వు వేసి వేడి చేయాలి. పంచదార కరిగి నీళ్లు వేడెక్కిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శనగపిండిని 8 నుండి 10 నిమిషాల పాటు బాగా వేయించిన తరువాత పాలు పోసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పంచదార మిశ్రమాన్ని వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పంచదార మిశ్రమాన్ని వేసిన తరువాత దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. హల్వా చక్కగా ఉడికి దగ్గర పడిన తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బేసన్ హల్వా తయారవుతుంది. ఈ హల్వాను వద్దు అనకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా శనగపిండితో హల్వాను తయారు చేసి తీసుకోవచ్చు.