Besan Ravva Laddu : బొంబాయి రవ్వతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రవ్వతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ బొంబాయి రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో రవ్వ లడ్డూలు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ రవ్వ లడ్డూలను మనం మరింత రుచిగా శనగపిండి వేసి కూడా తయారు చేసుకోవచ్చు. శనగపిండి వేసి చేసే ఈ రవ్వ లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. శనగపిండి వేసి రవ్వ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బేసన్ రవ్వ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, శనగపిండి – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, పంచదార – ఒక కప్పు, యాలకులు – 2, ఎండు కొబ్బరి తురుము – గుప్పెడు, నెయ్యి – తగినంత.
బేసన్ రవ్వ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు వేసి వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో ఎండు కొబ్బరి పొడి వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రవ్వ, శనగపిండి, ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ రవ్వను మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు రవ్వను నాననివ్వాలి. తరువాత ఈ రవ్వ మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా రుద్దుకోవాలి. తరువాత ఒక్కో రవ్వ చపాతీని పెనం మీద వేసి నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత జార్ లో పంచదార, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే జార్ కాల్చుకున్న రవ్వ చపాతీలను ముక్కలుగా చేసి వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడి, ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి కలపాలి. తరువాత నెయ్యిని గోరు వెచ్చగా చేసి వేసుకోవాలి. ఇలా తగినంత నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బేసన్ రవ్వ లడ్డూలు తయారవుతాయి. మామూలు రవ్వ లడ్డూల కంటే ఈ విధంగా శనగపిండి వేసి చేసిన లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి. ఇవి 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.