Bread Omelette : కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి. దీనిని మనం అప్పుడప్పుడూ తయారు చేస్తూ ఉంటాం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులవుగా తయారు చేసుకోగలరు. అలాగే దీనిని తయారు చేయడానికి కూడా ఎక్కువగా సమయం పట్టదు. కేవలం పది నిమిషాల్లోరుచిగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 2, బ్రెడ్ స్లైసెస్ – 4, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను నెయ్యి లేదా బటర్ వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను వేసుకోవాలి. తరువాత అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పెనం మీద నూనె వేసుకోవాలి. తరువాత దానిపై కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి. తరువాత దానిపై బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఈ బ్రెడ్ ను అర నిమిషం పాటు ఉంచి మరో వైపుకు తిప్పాలి. ఈ ఆమ్లెట్ ను ఎర్రగా అయ్యే వరకు కాల్చుకున్న తరువాత మరో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. తరువాత అంచులను మూసేసి ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ తయారవుతుంది. బ్రేక్ ఫాస్ట్ గా లేదా స్నాక్స్ గా ఇలా కోడిగుడ్లతో బ్రెడ్ ఆమ్లెట్ ను తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తింటారు.