Biryani Gravy : మనం వంటింట్లో బిర్యానీ, పులావ్ వంటి స్పెషల్ వంటకాలను కూడా వండుతూ ఉంటాం. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. ఈ వంటకాలు రుచిగా ఉన్నప్పటికి వీటిని గ్రేవీ కర్రీలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. చాలా మందికి ఈ గ్రేవీ కర్రీని తయారు చేసే సమయం ఉండదు. కనుక చాలా తక్కువ సమయంలో, రుచిగా , చాలా సులభంగా చేసుకునేలా వెజ్, నాన్ వెజ్ బిర్యానీలోకి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బిర్యానీ గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, నీళ్లు – ఒక కప్పు, కసూరి మెంతి – ఒక టీ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుకొబ్బరి ముక్కలు – పావు కప్పు, దాల్చినచెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, ధనియాలు – 2 టీ స్పూన్స్, గసగసాలు – 2 టీ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన టమాటాలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), కొత్తిమీర – పావు కప్పు, పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
బిర్యానీ గ్రేవీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఎండుకొబ్బరి ముక్కలు,దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, గసగసాలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేయాలి. ఇందులోనే తగినంత నీటిని పోసి మెత్తని పేస్ట్ లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు 5 నుండి 10 నిమిషాల పాటు అడుడు మాడిపోకుండా కలుపుతూ వేయించాలి. తరువాత నీళ్లు, కసూరి మెంతి వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బిర్యానీ గ్ఏవీ తయారవుతుంది. దీనిని వెజ్, నాన్ వెజ్ బిర్యానీలతో పాటు పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.