Coriander : కొత్తిమీర.. మనం వండే వంటకాలను గార్నిష్ చేయడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తాం. మనం చేసే వంటల రుచిని ఇది అమాంతం పెంచుతుంది. వంటల్లో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ లతో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో కొత్తిమీర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు కొత్తిమీరను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. కొత్తిమీరలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొత్తిమీరను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. చిగుళ్ల సమస్యలు తగ్గిస్తుంది. కొత్తిమీరకు జీవక్రియ రేటును పెంచే శక్తి ఉంది. బరువు తగ్గడంలో కూడా కొత్తిమీర మనకు ఎంతగానో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను కరిగించే యాంటి ఆక్సిడెంట్లు కొత్తిమీరలో ఎక్కువగా ఉన్నాయి. మనకు ఎంతో మేలు చేసే కొత్తిమీరను మనం చాలా సులభంగా మన ఇంట్లో పెంచుకోవచ్చు. కొత్తిమీరను సులువుగా ఇంట్లో ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా కొన్ని ధనియాలను చేతిలోకి తీసుకుని నలపాలి. ఇలా చేయడం వల్ల ధనియాలు రెండు ముక్కలుగా అవుతాయి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కుండినీ తీసుకుని దానిలో మట్టిని పోసి సమానంగా చేసుకోవాలి. తరువాత ధనియాలను తీసుకుని కుండీలో చల్లాలి.
తరువాత మరికొద్దిగా మట్టిని తీసుకుని ఈ ధనియాలపై పలుచగా చల్లాలి. ఇప్పుడు నీటిని తీసుకుని మట్టిపై కొద్దిగా చేత్తో చల్లాలి. తరువాత ఈ కుండీని సూర్యరశ్మి తగిలే చోట ఉంచాలి. రోజూ రెండుపూటలా కొద్దికొద్దిగా నీటిని చల్లుతూ ఉండాలి. మూడు నుండి నాలుగు రోజుల్లోనే ధనియాల నుండి మొలకలు రావడాన్ని మనం గమనించవచ్చు. ఇలా రోజూ నీటిని చల్లుతూ ఉండాలి. పది రోజుల్లోనే చిన్న చిన్నగా కొత్తిమీర రావడాన్ని గమనించవచ్చు. ఈ విధంగా సహజ సిద్దంగా ఇంట్లో కొత్ఇమీరను పెంచుకుని తీసుకోవడం వల్ల మనం మరింత చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.