Bread Coconut Rings : మనం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటాము. టీ, పాలతో తినడంతో పాటు వీటితో వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా సులభం. అలాగే బ్రెడ్ తో తీపి వంటకాలను తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. బ్రెడ్ తో చాలా సులభంగా, రుచిగా, కేవలం పది నిమిషాల్లోనే చేసుకోదగిన తీపి వంటకాల్లో బ్రెడ్ కొకోనట్ రింగ్స్ కూడా ఒకటి. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. బ్రెడ్ తో కొకోనట్ రింగ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ కొకోనట్ రింగ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 6, పంచదార – 100 గ్రా., ఎండు కొబ్బరి పొడి – 50 గ్రా., యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బ్రెడ్ కొకోనట్ రింగ్స్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పంచదార, ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. దీనిని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్టైసెస్ ను పెద్ద గ్లాస్ తో గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని కట్ చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్ చేసుకున్న బ్రెడ్ ను వేసి బ్రెడ్ ను వేసి వేయించాలి. ఈ బ్రెడ్ ను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ బ్రెడ్ ముక్కలను పంచదార పాకంలో వేసి అర నిమిషం పాటు ఉంచాలి. తరువాత వీటికి కొబ్బరి పొడితో రెండు వైపులా కోటింగ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ కొకోనట్ రింగ్స్ తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా త్వరగా అయ్యే ఈ బ్రెడ్ కొకోనట్ రింగ్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.