Bread Custard : మనం బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయార చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బ్రెడ్ కస్టర్డ్ కూడా ఒకటి. బ్రెడ్ కస్టర్డ్ చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ కస్టర్డ్ ను ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత కూడా తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ బ్రెడ్ కస్టర్డ్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ కస్టర్డ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 4, పాలు – అర లీటర్, కుంకుమ పువ్వు – చిటికెడు, పంచదార – 4 టీ స్పూన్స్, కస్టర్డ్ పౌడర్ – 2 టీ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ పలుకులు – కొద్దిగా.
బ్రెడ్ కస్టర్డ్ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత బ్రెడ్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ను వేసి కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో పాలు, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. పాలు మరిగిన తరువాత పంచదార వేసి కలపాలి. దీనిని మరో 4 నిమిషాల పాటు మరిగించిన తరువాత ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి. దీనిని చిక్కబడే వరకు కలుపుతూ మరిగించాలి. ఇలా 3 నుండి 4 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో వేయించిన బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. తరువాత వీటిపై డ్రై ఫ్రూట్ పలుకులను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బ్రెడ్ కస్టర్డ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.