Bread Puri : మనం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలు, చిరుతిళ్లు తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఇలా బ్రెడ్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు మనం పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే ఈ పూరీలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో రుచిగా పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 3, ఉప్పు – తగినంత, గోధుమపిండి లేదా మైదాపిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ- ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 1 లేదా 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బ్రెడ్ పూరీ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ బ్రెడ్ పొడిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, గోధుమపిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని మరోసారి బాగా కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పూరీలా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక పూరీలు వేసి వేయించాలి. పూరీలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పూరీలు తయారవుతాయి. వీటిని మసాలా కూరలతో తింటే చాలా రుచిగా ఉంటాయి. తరుచూ ఒకేరకంగా కాకుండా ఇలా బ్రెడ్ తో కూడా రుచిగా పూరీలను తయారు చేసుకుని తినవచ్చు.