Bread Rasamalai : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో రసమలై కూడా ఒకటి. రసమలై చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. సాధారణంగా మనం రసమలైను పాల విరుగుడుతో తయారు చేస్తూ ఉంటాం. రసమలై రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయడం కొద్దిగా శ్రమతో కూడుకున్న పని. ఎటువంటి శ్రమ లేకుండా చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో మనం బ్రెడ్ తో కూడా రసమలైను తయారు చేసుకుని తినవచ్చు. బ్రెడ్ తో చేసే రసమలై నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంటుంది. అలాగే దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, సులభంగా బ్రెడ్ తో రసమలైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ రసమలై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – లీటర్, బ్రెడ్ స్లైసెస్ – 5, తరిగిన బాదం పప్పు – కొద్దిగా, తరిగిన జీడిపప్పు – కొద్దిగా, తరిగిన పిస్తా పప్పు – కొద్దిగా, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు – చిటికెడు, పంచదార – అర కప్పు లేదా తగినంత.
బ్రెడ్ రసమలై తయారీ విధానం..
ముందుగా అంచు పదునుగా ఉండే గ్లాస్ తో బ్రెడ్ ను రసమలై ఆకారంలో గుండ్రంగా కట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. ఈ పాలను మధ్యస్థ మంటపై కలుపుతూ మరిగించాలి. ఈ పాలు చిక్కబడి పావు లీటర్ అయ్యే వరకు మరిగించిన తరువాత తరిగిన డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకునన్న బ్రెడ్ ను రసమలైలో రెండు వైపులా ముంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన రసమలైను బ్రెడ్ మీద వేసుకోవాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న రసమలైను ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ రసమలై తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పాల విరుగుడుతో చేసే రసమలై కంటే ఈ విధంగా బ్రెడ్ రసమలైను తయారు చేయడం చాలా సులభం. తీని తినాలనిపించినప్పుడు ఇలా బ్రెడ్ తో సులభంగా రసమలైను తయారు చేసుకుని తినవచ్చు.