Constipation Remedy : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య దీర్ఘకాలం పాటు అలాగే ఉంటే మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. మన పొట్ట, ప్రేగులు సరిగ్గా శుభ్రం కాకపోవడం వల్ల దాదాపు మనం 30 నుండి 40 కు పైగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సమస్యను మనం వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. ఈ సమస్య కారణంగా శరీరంలో విష పదార్థాలు, మలినాలు ఎక్కువగా పేరుకుపోతాయి. ఇవి మనల్ని తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తాయి. మలబద్దకం కారణంగా గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
అలాగే మలబద్దకం కారణంగా జుట్టు రాలడం, ఫైల్స్, చర్మ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా తలెత్తే సమస్యల్లో ఇది ఒకటి. వ్యాయామం చేయకపోవడం, ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం, జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోవడం వంటి వివిధ కారణాల చేత మలబద్దకం సమస్య తలెత్తుతుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల సమస్య అప్పటికప్పుడు తగినప్పటికి కడుపు మాత్రం పూర్తిగా శుభ్రం కాదు. పొట్ట పూర్తిగా శుభ్రం కాని వారు, మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఇంట్లోనే ఒక పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల ఈ సమస్య నుండి శాశ్వతంగా బయటపడవచ్చు. మలబద్దకం సమస్యను తగ్గించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ రెండు టీ స్పూన్ ధనియాలను, రెండు టీ స్పూన్ల వాము, రెండు టీ స్పూన్ల జీలకర్రను, రెండు టీ స్పూన్ల సోంపు గింజలు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అతి మధురం పొడిని, 10 కరక్కాయలను, 8 యాలకులను, అర టేబుల్ స్పూన్ నల్ల ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కళాయిలో ధనియాలు, జీలకర్ర, వాము వేసి దోరగా వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన పొడిని ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం రసం వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున కొద్ది కొద్దిగా టీ తాగినట్టు తాగాలి. దీనిని క్రమం తప్పకుండా 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా మలబద్దకం సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రమవుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది. అలాగే ఈ పొడిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఈ చిట్కాను పాటిస్తూనే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. వ్యాయామం చేయాలి. ఈ విధంగా ఈచిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మలబద్దకం సమస్యను తగ్గించుకోవచ్చు.