Breakfast Tomato Chutney : మనం ఉదయం పూట రకరకాల అల్పాహారాలను అలాగే రకరకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. చట్నీలు రుచిగా ఉంటేనే మనం తయారు చేసే అల్పాహారాలు రుచిగా ఉంటాయి. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన వెరైటీ చట్నీలలో టిపిన్ టమాట చట్నీ కూడా ఒకటి. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా రుచిగానే ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎవరైనా తేలికగా తయారు చేసుకోవచ్చు. టిఫిన్స్ లలోకి రుచిగా టమాట చట్నీని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టిఫిన్ టమాట చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 2 టీ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 8, మధ్యస్థంగా ఉండే ఉల్లిపాయలు – 3, తరిగిన అల్లం – ఒక ఇంచు ముక్క, మధ్యస్థంగా ఉండే టమాటాలు – 3, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు -3, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2.
టిఫిన్ టమాట చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. టమాట ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని చట్నీలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట చట్నీ తయారవుతుంది. దీనిని ఏ టిపిన్ తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చట్నీలతో పాటు అప్పుడప్పుడూ ఇలా టమాటాలతో కూడా చట్నీని తయారు చేసుకుని తినవచ్చు.