Broccoli Fry : మనం బ్రోకలీని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బ్రోకలీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా కాపాడడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా బ్రోకలీ మనకు సహాయపడుతుంది. సలాడ్ రూపంలో తీసుకోవడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రోకలీ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో ఈ ఫ్రైను మనం తయారు చేసుకోవచ్చు. బ్రోకలీ ఫ్రైను సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రోకలీ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రకోకలి – 1( మధ్యస్థంగా ఉన్నది), నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాలు – ఒక టీ స్పూన్, పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 6, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బ్రోకలీ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బ్రోకలీని కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత జార్ లో ధనియాలు, పుట్నాలపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుకొబ్బరి ముక్కలు, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత బ్రోకలీ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించాలి. బ్రోకలీ వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రోకలీ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బ్రోకలీతో ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.