Butter Murukulu : మనం బియ్యంపిండితో రకరకా లపిండి వంటలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన పిండి వంటలల్లో మురుకులు కూడా ఒకటి. మురుకులు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. తరచూ ఒకేరకం మురుకుల కాకుండా కేవలం బియ్యంపిండిని ఉపయోగించి కూడా మనం మురుకులను తయారు చేసుకోవచ్చు. బటర్ వేసి చేసే ఈ మురుకులు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ బటర్ మురుకులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ మురుకుల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – 3 కప్పులు, ఉప్పు – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, వాము – ఒక టీ స్పూన్, కారం లేదా మిరియాల పొడి – ఒక టీ స్పూన్, కరిగించిన బటర్ – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బటర్ మురుకుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు, నువ్వులు, వాము. కారం వేసి కలపాలి. తరువాత బటర్ వేసి కలపాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత తగినన్ని నీళ్లు పోసి చేత్తో వత్తుతూ పిండిని బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మతూ పెట్టి 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మురుకుల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత తగినంత పిండిని ఉంచి నూనెలో మురుకులను వత్తుకోవాలి. తరువాత ఈ మురుకులను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే బటర్ మురుకులు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బటయ లభించే చిరుతిళ్లకు బదులుగా ఇలా ఇంట్లోనే బటర్ మురుకులను తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.