Caramel Popcorn : పాప్ కార్న్.. స్నాక్స్ గా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పాప్ కార్న్ ను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఇంట్లో కూడా మనం చాలా సులభంగా తయారు చేస్తూ ఉంటాము. పాప్ కార్న్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే మనకు బయట వివిధ రుచుల్లో ఈ పాప్ కార్న్ లభిస్తూ ఉంటుంది. వాటిలో క్యారమెల్ పాప్ కార్న్ ఒకటి. ఇది మనకు ఎక్కువగా థియేటర్ లో లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ క్యారమెల్ ను అదే రుచితో అంతే క్రిస్పీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. క్యారమెల్ పాప్ కార్న్ ను థియేటర్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారమెల్ పాప్ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పాప్ కార్న్ గింజలు – పావు కప్పు, పంచదార – రెండుంపావు కప్పులు, ఉప్పు – చిటికెడు, బటర్ – ఒక టేబుల్ స్పూన్, వంటసోడా – 2 చిటికెలు.
క్యారమెల్ పాప్ కార్న్ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా వెడల్పుగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పాప్ కార్న్ గింజలను వేసి మధ్యస్థ మంటపై 2 నుండి3 నిమిషాల పాటు వేయించాలి. ఈ గింజలు కొద్దిగా రంగు మారిన తరువాత మూత పెట్టి వేయించాలి. గింజలు మొత్తం పాప్ కార్న్ లాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి వీటిని పక్కకు ఉంచాలి. ఇప్పుడు మరలా అడుగు మందంగా, వెడల్పుగా ఉండే కళాయిలో పంచదార వేసి వేడి చేయాలి. దీనిని మధ్యస్థ మంటపై పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుతూ వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత మంటను చిన్నగా చేసి ఉప్పు, బటర్ వేసి కలపాలి. బటర్ కరిగిన తరువాత వంటసోడా వేసి కలపాలి.
దీనిని అర నిమిషం పాటు కలుపుతూ ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పాప్ కార్న్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా ఆరే వరకు అలాగే ఉంచాలి. తరువాత ఈ పాప్ కార్న్ విడదీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారమెల్ పాప్ కార్న్ తయారవుతుంది. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా క్యారమెల్ పాప్ కార్న్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.