Patnam Pakoda : మనం సాంయత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకునే వాటిలో పకోడాలు కూడా ఒకటి. పకోడాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే తరుచూ ఒకేరకం పకోడాలు కాకుండా కింద చెప్పిన విధంగా ఎంతో రుచిగా ఉండే పట్నం పకోడాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పకోడాలు తమిళనాడులో చాలా ప్రసిద్ది చెందినవి. టీ టైం స్నాక్స్ గా ఇవి చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. వీటిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. తమిళనాడు ఫేమస్ అయిన ఈ పట్నం పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పట్నం పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడువుగా తరిగిన ఉల్లిపాయలు – 5, ఉప్పు – తగినంత, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూన్, అల్లం పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, శనగపిండి – 2 కప్పులు, బియ్యంపిండి – అర కప్పు, కారం – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పట్నం పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. ఇందులో బియ్యంపిండి, కారం, వంటసోడా వేసి కలపాలి. తరువాత నెయ్య వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలల్లో కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ బాగా కలుపుకోవాలి. ఇందులో నీటిని పోయకూడదు. అవసరమైతే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూనల్ నీటిని మాత్రమే పోసి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మరీ గట్టిగా వత్తకుండా నెమ్మదిగా వత్తుతూ ఉండలాగా చేసుకోవాలి.
ఈ ఉండకు మధ్యలో గ్యాప్ ఉండేలా నెమ్మదిగా వత్తుకోవాలి. లేదంటే పకోడా లోపల సరిగ్గా వేగదు. ఇలా తయారు చేసుకున్న ఉండలను నూనెలో వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పట్నం పకోడాలు తయారవుతాయి. వీటిని టీతో స్నాక్స్ గా తీసుకోవడంతో పాటు ఈ పకోడాలతో కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.