Carrot Fry : క్యారెట్ తో మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. క్యారెట్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. క్యారెట్ తో తరచూ చేసే వంటకాల్లో క్యారెట్ ఫ్రై ఒకటి. ఈ క్యారెట్ ఫ్రైను కొబ్బరి తురుము వేసి మనం మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి వేసి చేసే క్యారెట్ ఫ్రై రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. కొబ్బరి తురుము వేసి క్యారెట్ ఫ్రైను రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ కొబ్బరి ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్ – అర కిలో, పచ్చి బఠాణీ – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చి కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – తగినంత.
క్యారెట్ కొబ్బరి ఫ్రై తయారీ విధానం..
ముందుగా క్యారెట్ ముక్కలను, పచ్చి బఠాణీని ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో పచ్చికొబ్బరి ముక్కలు, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉడికించిన క్యారెట్, బఠాణీ వేసి 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ కొబ్బరి ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.