Challa Mirapakayalu : మనం వంటల తయారీలో, పచ్చళ్ల తయారీలో, చట్నీల తయారీలో పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటాం. అసలు పచ్చి మిరపకాయలు లేని వంటిల్లు ఉండదనే చెప్పవచ్చు. పచ్చి మిరపకాయలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేసేలా చేయడంలో పచ్చి మిరపకాయలు ఎంతో ఉపయోగపడతాయి. వంటలలోనే కాకుండా పచ్చి మిరపకాయలతో చల్ల మిరపకాయలను కూడా తయారు చేస్తారు. వీటిని ఊర మిరపకాయలు అని కూడా అంటారు. వీటిని చాలా మంది రుచి చూసే ఉంటారు. చల్ల మిరపకాయలను వేయించి పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటుంటారు. చల్ల మిరపకాయలను మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.
చల్ల మిరపకాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
లావుగా కారం తక్కువగా ఉండే మిరపకాయలు – పావు కిలో, పుల్లని పెరుగు – పావు కిలో, నీళ్లు – 100 ఎంఎల్ , వాము – ఒక టీ స్పూన్, రాళ్ల ఉప్పు – 100 గ్రాములు లేదా తగినంత, పసుపు – అర టీ స్పూన్.
చల్ల మిరపకాయల తయారీ విధానం..
ముందుగా రోట్లో వామును వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత మిరపకాయల తొడిమెలను తొలగించకుండా వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసుకోవాలి. ఈ మిరపకాయలకు కత్తితో నిలువుగా గాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకుని కవ్వంతో చిలికి అందులో నీళ్లను పోసి మజ్జిగలా చేసుకోవాలి. ఇందులోనే ఉప్పును, పసుపును, ముందుగా దంచి పెట్టుకున్న వామును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మజ్జిగలో ముందుగా గాటు పెట్టుకున్న మిరపకాయలను వేసి కలిపి 24 గంటల పాటు ఊరబెట్టాలి. తరువాత వీటిని మజ్జిగ నుండి తీసి కవర్ మీద ఉంచి ఒక రోజంతా ఎండబెట్టాలి.
తరువాత వీటిని తీసి మిగిలిన మజ్జిగలో వేసి ఊరబెట్టి మరలా ఎండబెట్టాలి. ఇలా మజ్జిగ పూర్తిగా అయిపోయే వరకు చేసిన తరువాత ఈ మిరపకాయలను 5 నుండి 6 రోజుల పాటు పూర్తిగా ఎండే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల చల్ల మిరపకాయలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల ఈ మిరపకాయలు సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటాయి. చల్ల మిరపకాయలను వేయించేటప్పుడు నూనె కాగిన తరువాత మంటను చిన్నగా చేసి వేయించాలి. ఇలా వేయించడం వల్ల మిరపకాయలు బాగా వేగుతాయి. ఇలా చల్ల మిరపకాయలను వేయించి పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.