Garika : గరిక.. ఇది మనందరికీ తెలుసు. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతూనే ఉంటుంది. గరిక అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. గరికను పశువులు, మేకలు ఎంతో ఇష్టంగా తింటాయి. దీనిని తినడం వల్ల పశువులలో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. గరిక కదా అని చాలా మంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ గరిక కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గరిక రసం లేదా కషాయం చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. దీనిని సంస్కృతంలో శత వీర్య, సహస్ర వీర్య అని, హిందీలో దూర్వా అని పిలుస్తూ ఉంటారు. వాత నొప్పులను తగ్గించడంలో గరిక తైలం ఎంతగానో ఉపయోగపడుతుంది.
వేర్లతో సహా నేల మీద పాకే తీగ గరికను తీసుకుని వాటిని కత్తిరించి కణుపులను తొలగించి మెత్తగా నూరి రసాన్ని తీయాలి. ఈ రసానికి సమానంగా నువ్వుల నూనెను కలిపి మరిగించి వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని రాసుకోవడం వల్ల అన్ని రకాల వాత నొప్పులు తగ్గుతాయి. ముక్కు నుండి రక్తం కారడాన్ని తగ్గించడంలో కూడా గరిక ఎంతగానో ఉపయోగపడుతుంది. గరిక వేరును దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని 5 నుండి 6 చుక్కల మోతాదులో రెండు ముక్కు రంధ్రాలలోనూ వేయాలి. ఇలా చేయడం వల్ల వెంటనే ముక్కు నుండి రక్తం కారడం ఆగుతుంది. గరిక రసాన్ని 20 గ్రాముల మోతాదులో లోపలికి సేవించాలి. ఇలా చేయడం వల్ల రక్త విరేరోచనాలు, రక్త మొలలు, మూత్రంలో రక్తం రావడం వంటి రక్త పైత్యాలన్నీ తగ్గుతాయి.
మూత్రపిండాలలో రాళ్లను కరిగించే శక్తి కూడా గరికకు ఉంటుంది. శుభ్రమైన గరికను తెచ్చి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 3 టీ స్పూన్ల మోతాదులో రెండు పూటలా సేవించడం వల్ల 20 రోజులల్లోనే మూత్రపిండాలలో ఉండే రాళ్లు కరిగి పోతాయని నిపుణులు చెబుతున్నారు. బహిష్టు ఆగిన స్త్రీలు గరిక వేర్లను దంచి తీసిన రసాన్ని 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకుంటూ ఉంటే ఆగిన బహిష్ఠు మరలా వస్తుంది. 30 గ్రాముల మోతాదులో గరికె వేర్లను సేకరించి మెత్తగా నూరి ఆ ముద్దను ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టి చల్లగా అయిన తరువాత ఒక టీ స్పూన్ కండె చక్కెర పొడిని కలుపుకుని తాగడం వల్ల మూత్రం సాఫీగా వస్తుంది.
గరికెను, ఉత్తరేణి ఆకులను, యాలకులను సమపాళ్లలో తీసుకుని నూరి ఆ మిశ్రమాన్ని తెగిన గాయాలపై ఉంచడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగడంతోపాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి. 80 గ్రాముల తెల్ల గరిక సమూల రసం, 60 గ్రాముల ముల్లంగి రసం, 10 గ్రాముల సైంధవ లవణం, 60 గ్రాముల నువ్వుల నూనెను కలిపి నూనె మిగిలే వరకు మరిగించి నిల్వ చేసుకోవాలి. దీనిని రెండు పూటలా 4 నుండి 5 చుక్కల పరిమాణంలో చెవులలో వేసుకోవం వల్ల చెవి హోరు, చెవి నుండి చీము కారడం, చెవుడు తగ్గిపోతాయి. ఈ విధంగా గరికను ఉపయోగించి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.