మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో చామ దుంపలు కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. చామదుంపలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ చామదుంపలు జిగురుగా ఉన్న కారణంగా వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
చామదుంపలతో మనం వేపుడు, పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాం. చామదుంపలతో రుచిగా కరకరలాడే విధంగా ఉండే వేపుడును కూడా మనం తయారు చేసుకోవచ్చు. కరకరలాడే విధంగా ఉండే చామదుంప వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చామదుంప వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చామ దుంపలు – పావు కిలో, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, కచ్చ పచ్చాగా దంచిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చామదుంప వేపుడు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో చామదుంపలను వేసి తగినన్ని నీళ్లు పోయాలి. తరువాత కుక్కర్ పై మూత ఉంచి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత చామదుంపల మీద ఉండే పొట్టును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా ఉడికించిన చామదుంపలను కూడా వేసుకోవాలి. చామదుంపలకు పిండి అంతా పట్టేలా బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత కలిపి పెట్టుకున్న చామ దుంపలను వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత కొత్తిమీర తప్ప మిగిలిన తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు అంతా వేగిన తరువాత ముందుగా వేయించుకున్న చామదుంపలను కూడా వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే చామదుంప వేపుడు తయారవుతుంది. దీనిని పప్పు కూరలు, చారు వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చామదుంపలను తినలేని వారు ఇలా వేపుడుగా చేసుకుని తినడం వల్ల రుచితోపాటు చామదుంపల్లో ఉండే పోషకాలను కూడా పొందవచ్చు. ఇలా చేసిన చామదుంప వేపుడును కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు.