Chana Coconut Milk Curry : పెద్ద శనగలు లేదా కాబూలీ చనా ఎక్కువగా కుర్మా లేదా మసాల కూరల రూపంలో చేసుకుంటూ ఉంటాం. సాధారణంగా పూరీ లేదా చపాతీలతో జతగా ఈ శనగలను కూరను తినడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పెద్ద శనగలను కొబ్బరిపాలతో వండినపుడు పూరీ, చపాతీలతో పాటు అన్నంలో తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు కొబ్బరిపాలతో కాబూలీ శెనగల కర్రీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కాబూలీ శనగల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు..
పెద్ద శనగలు – 1 కప్పు, ఉల్లిపాయ- 1 , అల్లం తురుము- 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, టమాట గుజ్జు – అర కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు, పసుపు- అర స్పూన్, కారం- 1 స్పూన్, జీలకర్ర పొడి- 1 స్పూన్, ధనియాల పొడి- 1 స్పూన్, గరం మసాల- 1 స్పూన్, చాట్ మసాల – 1 స్పూన్, నెయ్యి – 1 స్పూన్, ఉప్పు – తగినంత, కొత్తిమీర – సరిపడా.
కాబూలీ శనగల కర్రీ తయారీ విధానం..
ముందుగా నానబెట్టుకున్న శనగలను నీళ్లతో సహా కుక్కర్ లో వేసుకొని వాటిలో కొద్దిగా ఉప్పును కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తరువాత దానిలో అల్లం వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగిన తరువాత దానిలో టమాట గుజ్జును వేయాలి. అది కాస్త ఉడికిన తరువాత దానిలో కొబ్బరిపాలు పోసి స్టౌవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి. కొద్దిసేపటి తరువాత ఉడికించిన శనగలతో పాటు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాల, చాట్ మసాల లను వేసి బాగా కలుపుకోవాలి.
స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర దగ్గరగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయిని దించుకోవాలి. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చనా కోకోనట్ మిల్క్ కర్రీ రెడీ అయినట్లే. ఇలా చేసుకుంటే అన్నంతో పాటు పూరీ, చపాతీలలో కూడా అద్భుతంగా ఉంటుంది.