Chicken Fry Piece Biryani : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఒకటి. మనకు రెస్టారెంట్ లలో ఈ బిర్యానీ ఎక్కువగా లభిస్తుంది. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ఫ్రై పీస్ బిర్యానీని ఇష్టంగా తింటారు. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా, తిన్నా కొద్ది తినాలనిపించేలా ఉండే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, టమాట ఫ్యూరీ – పావు కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, బ్రౌన్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.
చికెన్ మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – ఒక కిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ధనియాల పొడి – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – ఒక చెక్క.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
అర గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – అరకిలో, వేడి నీళ్లు – మూడున్నర గ్లాసులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, మరాఠీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, బ్రౌన్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, లవంగాలు – 5, యాలకులు – 4, నల్ల యాలక్కాయ – 1, అనాసపువ్వు – 1, జాపత్రి – 1, స్టోన్ ప్లవర్ – 1, శొంఠి -అర ఇంచు ముక్క, మిరియాలు – అర టీ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్.
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత ఈ చికెన్ ను గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని నిమిషం పాటు వేయించిన తరువాత బ్రౌన్ ఆనియన్స్, ధనియాల పొడి వేసి కలపాలి.
తరువాత నానబెట్టుకున్న బియ్యం వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత వేడి నీళ్లు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడిలో సగం పొడిని వేసి కలపాలి. ఇప్పుడు బియ్యంపై మూతను ఉంచి దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత మరోసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారిన తరువాత టమాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత చికెన్ ను వేసి కలపాలి. ఇప్పుడు చికెన్ పై మూతను ఉంచి చికెన్ లోని నీరంతా పోయి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసి కలిపి 5 నిమిషాల పాటు పెద్ద మంటపై టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ తయారవుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా ఉడికించిన కోడిగుడ్లను ఉంచాలి. తరువాత వాటిపై చికెన్ ను ఉంచాలి. తరువాత దీనిపై అన్నాన్ని వేసుకుని ప్లేట్ లో బోర్లించి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ప్రై పీస్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతా, అలాగే గ్రేవీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.