Tomato Munakkaya Curry : మనం మునక్కాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మునక్కాయలను ఎక్కువగా సాంబార్ లో వేస్తూ ఉంటాము. అలాగే వీటితో పచ్చడి, కూర వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. మునక్కాయతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మునక్కాయలల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగి ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఈ మునక్కాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట మునక్కాయ కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూరను ఇష్టంగా తింటారు. ఎటువంటి మసాలాలు వేయకుండా ఈ కూరను మనం రుచిగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ టమాట మునక్కాయ కూరను మసాలాలు వేయకుండా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మునక్కాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన మునక్కాయలు – 2, చిన్న ముక్కలుగా తరిగిన టమాటాలు – అరకిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, సాంబార్ కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్.
టమాట మునక్కాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా టమాట ముక్కల్లో ఒక కప్పు టమాట ముక్కలను తీసి పక్కకు ఉంచాలి. తరువాత మిగిలిన టమాట ముక్కలను జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత మునక్కాయ ముక్కలను వేసి కలపాలి. తరువాత వీటిపై మూతను ఉంచి ముక్కలను మగ్గించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత మిక్సీ పట్టుకున్న టమాట ఫ్యూరీతో పాటు మిగిలిన టమాట ముక్కలు, ఉప్పు కూడా వేసి కలపాలి. వీటిపై మూతను ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మూత తీసి నీరంతా పోయే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కారం, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మునక్కాయ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాట మునక్కాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.