Chicken Pop Corn : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. బరువు పెరగడంలో, శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ ను అందించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చికెన్ మనకు ఎంతో సహాయపడుతుంది. ఈ చికెన్ తో మనం ఎన్నో రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో తయారు చేసుకోగలిగిన వంటల్లో చికెన్ పాప్ కార్న్ కూడా ఒకటి. ఈ వంటకాన్ని మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ చికెన్ పాప్ కార్న్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పాప్ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అర కిలో, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, కోడి గుడ్డు – 1, మైదా పిండి – అర కప్పు, బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, కారం – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
చికెన్ పాప్ కార్న్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, వెనిగర్, ఉప్పు, కార్న్ ఫ్లోర్, కోడి గుడ్డు వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక ప్లేట్ లో మైదా పిండిని, బ్రెడ్ క్రంబ్స్ ను, ఒక టీ స్పూన్ కారాన్ని , తగినంత ఉప్పును వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ఒక్కో చికెన్ ముక్కను తీసుకుంటూ మైదా పిండి మిశ్రమంలో వేసి మైదా పిండి మిశ్రమం ముక్కకు బాగా పట్టేలా చేసి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చికెన్ ముక్కలను టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల మెత్తగా పైన కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే చికెన్ పాప్ కార్న్ తయారవుతుంది.
ఈ పాప్ కార్న్ తయారీలో వాడే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ను, బ్రెడ్ క్రంబ్స్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎండు మిరపకాయలను వేయించి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అలాగే బ్రెడ్ ను కూడా రెండు వైపులా కాల్చి ముక్కలుగా చేసి జార్ లో వేసి మరీ మెత్తగా కాఉండా మిక్సీ పట్టుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రంబ్స్ అందుబాటులో లేని వారు ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన చికెన్ పాప్ కార్న్ ను నేరుగా లేదా టమాట కెచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.