Chikkudukaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలలో చిక్కుడు కాయలు ఒకటి. చిక్కుడు కాయలను మనం చాలా కాలం నుండి ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. చిక్కుడు కాయలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్ ) స్థాయిలను తగ్గించి గుండెను సంరక్షిస్తాయి. మానసిక ఒత్తిడిని, నిద్ర లేమిని దూరంలో చేయడంలో చిక్కుడు కాయలు సహాయపడతాయి. చిక్కుడు కాయలల్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మలబద్దకం తగ్గడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రక్త హీనతను తగ్గించడంలోనూ చిక్కుడు కాయలు ఉపయోగపడతాయి. అయితే వీటితో వేపుడును చేసుకుని తినవచ్చు. అది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడు కాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కుడు కాయలు – అర కిలో, నూనె – ఒక టేబుల్ స్పూన్ , ఆవాలు – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిరప కాయలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, పుట్నాల పొడి – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 8, ఉప్పు – రుచికి సరిపడా.
చిక్కుడు కాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా చిక్కుడు కాయలను ముక్కలుగా చేసి శుభ్రంగా కడగాలి. తరువాత ఒక గిన్నెలో కడిగి పెట్టుకున్న చిక్కుడు కాయలను, కొద్దిగా ఉప్పును వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో కానీ, గిన్నెలో కానీ కారం, ధనియాల పొడి, పుట్నాల పొడి, ఎండు కొబ్బరి పొడి, కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి చేత్తో అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఒక కళాయిలో నూనె వేస కాగాక ఆవాలు, మినప పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఉడికించి పెట్టుకున్న చిక్కుడు కాయలు, పసుపు, రుచికి సరిపడేలా మరి కొద్దిగా ఉప్పును వేసుకుని కలుపుకోవాలి.
ఈ చిక్కుడు కాయలను మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. చిక్కుడు కాయలు పూర్తిగా ఉడికిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న కారం, వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడు కాయ వేపుడు తయారవుతుంది. ఈ చిక్కుడు కాయ వేపుడును నేరుగా లేదా పప్పు, రసం, చారు వంటి వాటితో కలిపి తిన్నా చాలా రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.