Nuvvula Karam Podi : నువ్వుల కారం పొడి ఆరోగ్యానికి ఎంతో మంచిది.. అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..!

Nuvvula Karam Podi : పూర్వ కాలం నుండి మ‌నం వంటింట్లో ఉప‌యోగించే వాటిల్లో నువ్వులు ఒక‌టి. నువ్వులు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం అధికంగా ఉండే వాటిల్లో నువ్వులు ఒక‌టి. పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు, ఎముక‌లు దృఢంగా ఉండ‌డంలో నువ్వులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. నువ్వుల‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. నువ్వుల‌ల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. బీపీని త‌గ్గించ‌డంతోపాటు శ‌రీరంలో ఉండే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో కూడా నువ్వులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Nuvvula Karam Podi is very healthy to us eat at first
Nuvvula Karam Podi

బి కాంప్లెక్స్ విట‌మిన్స్ నువ్వుల‌ల్లో అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్ ల‌భించే వృక్ష సంబంధ‌మైన ఆహార ప‌దార్థాల‌లో నువ్వులు ఒక‌టి. నువ్వుల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నువ్వుల‌ను మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో వాడుతూ ఉంటాం. నువ్వులను పొడిగా చేసి ప‌చ్చ‌ళ్ల‌ను, కూర‌ల‌ను త‌యారు చేయ‌డంతోపాటు నువ్వుల నూనెను కూడా మ‌నం వాడుతూ ఉంటాం. వీటితోపాటు నువ్వుల‌తో ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉంటుంది. దీన్ని అన్నంలో మొద‌టి ముద్ద‌తో తింటే అనేక అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. ఇక నువ్వుల కారం పొడిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నువ్వులు – 100 గ్రా., ధ‌నియాలు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – గుప్పెడు, ఎండు మిర‌ప‌కాయ‌లు – 10, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్‌, ఆవాలు – పావు టీ స్పూన్, మెంతులు – 5 లేదా 6, ఉప్పు – రుచికి స‌రిప‌డా, ప‌సుపు – చిటికెడు, క‌చ్చా ప‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు – 10.

నువ్వుల కారం పొడిని త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ధ‌నియాలు, క‌రివేపాకు, ఎండు మిర‌ప‌కాయ‌లు, జీల‌క‌ర్ర‌, ఆవాలు, మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న వాట‌న్నింటితో పాటుగా ఉప్పు, ప‌సుపు వేసి కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. చివ‌ర‌గా కచ్చా ప‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లను వేసి కొద్దిగా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల కారం పొడి త‌యార‌వుతుంది. ఈ కారం పొడిని మూత ఉండే డ‌బ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కారం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ కారం పొడిని న‌ల్ల నువ్వుల‌తో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ నువ్వుల కారం పొడిని ఉద‌యం అల్పాహారంలో త‌యారు చేసే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌తోపాటు వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి కూడా తిన‌వ‌చ్చు. నువ్వుల‌ను ఇలా కారం పొడిలా త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతోపాటు శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది.

Share
D

Recent Posts