మనం ఆహారంగా తీసుకునే సోయా ఉత్పత్తుల్లో మీల్ మేకర్ లు కూడా ఒకటి. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేకర్ లలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లతోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. మాంసాహారాన్ని తినని వారు మీల్ మేకర్ లను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ అన్నీ లభిస్థాయి. మీల్ మేకర్ లతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మీల్ మేకర్ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, ధనియాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 3 ( చిన్నవి), లవంగాలు – 6, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5, పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – అర కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, యాలకులు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – అర కప్పు, తరిగిన పుదీనా ఆకులు – ఒక టేబుల్ స్పూన్.
మీల్ మేకర్ మసాలా కూర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్లను తీసుకుని అందులో మీల్ మేకర్ లను వేసి నానబెట్టుకోవాలి. తరువాత ఈ మీల్ మేకర్ లలో ఉండే నీటిని చేత్తో పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక జార్ లో ధనియాలను, 2 దాల్చిన చెక్క ముక్కలను, 4 లవంగాలను, పల్లీలను, అల్లం ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను, పచ్చి కొబ్బరి ముక్కలను, పావు కప్పు నీళ్లను పోసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత నానబెట్టుకున్న మీల్ మేకర్ లను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి.
తరువాత అదే కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత దాల్చిన చెక్క ముక్కను, యాలకులను, లవంగాలను, పచ్చి మిర్చిని, ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
తరువాత పుదీనా ఆకులను వేసి ఉడికించాలి. తరువాత వేయించిన మీల్ మేకర్ లను కూడా వేసి కలపాలి. తరువాత పావు కప్పు నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ మసాలా కూర తయారవుతుంది. మాంసాహారాన్ని తినని వారు ఇలా మీల్ మేకర్ లతో మసాలా కూరను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లు కూడా లభిస్తాయి. ఇలా చేసిన మీల్ మేకర్ మసాలా కూరను అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, పులావ్, బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.