మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. టమాటాలతో చేసే వంటల్లో టమాట రసం కూడా ఒకటి. టమాట రసాన్ని మరింత రుచిగా.. ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మిరియాల రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్దగా తరిగిన టమాటాలు – 4 ( పెద్దవి), చింతపండు – 10 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్క – 1 (చిన్నది), ఎండు కొబ్బరి ముక్కలు – 2 (చిన్నవి), వెల్లుల్లి రెబ్బలు – 2, కారం – పావు టీ స్పూన్, నీళ్లు – 1 లీటర్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 1, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చి మిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కారం – పావు టీ స్పూన్.
టమాట మిరియాల రసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో తరిగిన టమాటాలను, ఉప్పును, చింతపండును, పసుపును, అర కప్పు నీటిని పోసి మెత్తగా ఉడికించుకోవాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత వాటిని పప్పు గుత్తితో లేదా గంటెతో మెత్తగా చేసుకోవాలి. తరువాత వాటిలో లీటర్ నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో వెల్లుల్లి రెబ్బలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి వేయించుకోవాలి.
తాళింపు పదార్థాలు వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న టమాట రసాన్ని వేయాలి. తరువాత కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోవాలి. ఈ రసాన్ని పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మిరియాల రసం తయారవుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా టమాట మిరియాల రసాన్ని చేసుకుని అన్నంతో కలిపి తినడం వల్ల రుచితోపాటు ఆయా సమస్యల నుండి త్వరగా ఉపశమనం కూడా పొందవచ్చు.