Cotton Dosa : మనం ఉదయం పూట అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలు చాలా రుచిగా ఉంటాయి. పిండిని తయారు చేసుకుని పెట్టుకుని ఎప్పటిపడితే అప్పుడూ దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే మన రుచికి తగినట్టు మనం వివిధ రకాల దోశలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోగలిగే దోశలల్లో కాటన్ దోశ కూడా ఒకటి. ఈ దోశ మందంగా, చిన్నగా చాలా మెత్తగా ఉంటుంది. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. రుచిగా, మెత్తగా కాటన్ దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాటన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, అటుకులు – పావు కప్పు, బొంబాయి రవ్వ – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, నల్లటి భాగం తీసిన పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత.
కాటన్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అలాగే పిండి పట్టడానికి అర గంట ముందు బొంబాయి రవ్వను, అటుకులను ఒక గిన్నెలోకి తీసుకుని అర కప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో నానబెట్టుకున్న అటుకులను, ఉప్మా రవ్వను, కొబ్బరి ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి పిండిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పిండిపై మూతను ఉంచి 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. పిండి చక్కగా పులిసిన తరువాత దానిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూ పేపర్ తో లేదా ఉల్లిపాయతో రుద్దుకోవాలి.
తరువాత పిండిని తీసుకుని మందంగా వేసుకోవాలి. కాటన్ దోశ ఊతప్పంలా చిన్నగా ఉంటుంది. ఈ దోశను రంధ్రాలు పడే వరకు పెద్ద మంటపై కాల్చుకుని తరువాత మూత పెట్టి మంటను మధ్యస్థంగా ఉంచి ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి. తరువాత దోశను మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా దోశను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాటన్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈదోశను ఇన్ స్టాంట్ గా కూడా తయారు చేసుకోవచ్చు. పిండిని తయారు చేసుకున్న తరువాత పులియబెట్టే పని లేకుండా దానిలో వంటసోడా వేసుకుని కలిపి దోశ వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న కాటన్ దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.