Crispy Cauliflower Fry : క్యాలీప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోబి 65 కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా హోటల్స్, కర్రీ పాయింట్, క్యాటరింగ్ లలో లభిస్తుంది. గోబి 65 చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ గోబి 65 ను మనం కూడా ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, కలర్ ఫుల్ గా, రుచిగా ఈ గోబి 65 ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోబి 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్స్, టమాట సాస్ – 2 టీ స్పూన్స్, బియ్యం పిండి – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు నుండి ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోబి 65 తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మరీ పెద్దగా, మరీ చిన్నగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత కట్ చేసుకున్న క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ క్యాలీప్లవర్ ముక్కలను జల్లి గిన్నెలోకి తీసుకుని నీరంతా పోయే వరకు పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని తీసుకుని అన్ని కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ జారుడుగా కలుపుకోకూడదు.
పిండిని కలుపుకున్న తరువాత ఇందులో ముందుగా సిద్దం క్యాలీప్లవర్ ముక్కలను వేసి పిండిని బాగా పట్టించాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాలీప్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని నూనెలో వేయగానే కలపకుండా కొద్దిగా వేగే వరకు అలాగే ఉంచాలి. తరువాత అటూ ఇటూ కదుపుతూ మధ్యస్థ మంటపై క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరగా అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరకరలాడుతూ ఉండే గోబి 65 తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి కూరలతో కలిపి సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది.