Gond Katira Sweet : గోంధ్ కటిరా.. దీనినే బాదం బంక అని కూడా అంటారు. ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో, షాపుల్లో ఇది సులభంగా లభిస్తుంది. గోంధ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రోజంతా ఉత్సాహంగాఉండవచ్చు. పురుషులు దీనిని తీసుకోవడం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. బాలింతలు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గోంధ్ తో మెదడు పనితీరు మెరుగుపడేలా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందేలా స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంధ్ కటిరా స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్, గోంధ్ – పావు కప్పు, బాదంపప్పు – పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు, వాల్ నట్స్ – పావు కప్పు, పుచ్చ గింజల పప్పు – పావు కప్పు, గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, జాజికాయ పొడి – అర టీ స్పూన్, దంచిన యాలకులు – 5, శొంఠి పొడి – ఒక టేబుల్ స్పూన్, పాలు – పావు లీటర్.
గోంధ కటిరా స్వీట్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోంధ్ ను వేసి వేయించాలి. గోంధ్ చక్కగా పొంగి తెల్లగా అయ్యే వరకు వేయించిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత అదే నెయ్యిలో బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్ వేసి వేయించాలి. తరువాత గసగసాలు వేసి వేయించాలి. చివరగా కొబ్బరి పొడిని కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన గోంధ్ ను తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత జాజికాయ పొడి, యాలకులు, శొంఠి వేసి మరోసారి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి.
పాలు మరిగిన తరువాత మంటను చిన్నగా చేసి మిక్సీ పట్టుకున్న పొడిని వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలిపిన తరువాత దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం నెయ్యి వదులుతూ కళాయికి అంటుకోకుండా వేరయ్యే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన డబ్బాలో వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇది 20 రోజుల వరకు తాజాగా ఉంటుంది. రోజుకు ఒక స్పూన్ మోతాదులో దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, పెద్దలు ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. మెదడు పని తీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరం ధృడంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది.