Curry Leaves Chicken Fry : కరివేపాకు చికెన్ వేపుడు.. పేరు చూస్తేనే ఈ చికెన్ వేపుడును ఎలా తయారు చేస్తారో అర్థమైపోతుంది. కరివేపాకు ఎక్కువగా వేసి చేసే ఈ చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. తరుచూ ఒకేరకం చికెన్ వేపుళ్లు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా వెరైటీగా చికెన్ వేపుడును తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. చూస్తేనే తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కరివేపాకు చికెన్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు చికెన్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – 10 రెమ్మలు, నూనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అనాస పువ్వు – 1, లవంగాలు – 4, జాపత్రి – కొద్దిగా, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, దంచిన వెల్లుల్లిపాయ – చిన్నది ఒకటి, పుదీనా – 10 ఆకులు, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, తరిగిన టమాట – పెద్దది ఒకటి, చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 5, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కరివేపాకు చికెన్ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకును క్రిస్పీగా అయ్యే వరకు వేయించిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. ఇందులోనే మరో రెండు రెమ్మల కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. వెల్లుల్లి కొద్దిగా రంగు మారిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
తరువాత చికెన్, టమాట ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ను 15 నుండి 20 నిమిషాల పాటు వేయించాలి. చికెన్ పూర్తిగా మెత్తబడిన తరువాత ముందుగా వేయించిన కరివేపాకును చేత్తో మెత్తగా చేసుకుని వేసుకోవాలి. తరువాత ఈ చికెన్ ను ముక్కలు ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు చికెన్ తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కరివేపాకు చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.