David Warner : అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ జోరు ఇంకా తగ్గడం లేదు. ఈ మూవీలో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే.. డైలాగ్‌ను ఇప్పటికీ ఇంకా చాలా మంది అనుకరిస్తున్నారు. అలాగే ఆయన శ్రీవల్లి పాటకు వేసిన స్టెప్‌తోపాటు రష్మిక మందన్న చేసిన సామి సాంగ్ ఐకానిక్ స్టెప్ ను కూడా చాలా మంది వేస్తూ అలరిస్తున్నారు. అయితే గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో ఆడిన డేవిడ్ వార్నర్ అప్పట్లో ఎన్నో తెలుగు పాటలకు డ్యాన్స్‌లు చేసి అలరించాడు. ఇక ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తున్నాడు.
కాగా పాకిస్థాన్ జట్టుతో ఆస్ట్రేలియా అక్కడి రావల్పిండిలో మొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం విదితమే. ఈ టెస్టు మ్యాచ్‌లో భాగంగా పాక్ ఇన్నింగ్స్ సమయంలో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. బౌండరీ లైన్ వద్ద ఉన్న డేవిడ్ వార్నర్ పుష్ప సినిమాలోని రెండు సీన్లను చేసి చూపించాడు. అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే డైలాగ్‌ను చెప్పడంతోపాటు సామి సాంగ్ స్టెప్‌ను వేసి వార్నర్ అలరించాడు.
అయితే వార్నర్ చెప్పిన డైలాగ్, చేసిన స్టెప్‌కు బౌండరీ లైన్ వద్ద ఉన్న పాక్ ప్రేక్షకులు సైతం చప్పట్లతో హోరెత్తించారు. వార్నర్ అలా చేయగానే వారు చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా గతంలో రవీంద్ర జడేజా కూడా ఇలాగే పుష్ప స్టెప్ వేసి అలరించాడు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు పుష్ప స్టెప్ వేసి అలరిస్తున్నారు. ఇక పాక్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కొనసాగుతున్న టెస్టు డ్రా దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో వార్నర్ అద్భుతంగా రాణించాడు. 114 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. దీంతో ఈ మ్యాచ్ డ్రా కావడం పక్కాగా కనిపిస్తోంది.