Beeruva : మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం. అలాగే కొన్ని వస్తువులను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచుకోవాలి. ఈ వస్తువులను ఇంట్లో ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. అలాంటి వాటిల్లో బీరువా ఒకటి. మనం సంపాదించిన ధనాన్ని బీరువాలో దాచిపెడుతూ ఉంటాం. బీరువాను ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారమే ఉంచాలి. అలాగే బీరువాలో ధనాన్ని దాచిపెట్టుకునేటప్పుడు కూడా కొన్ని వస్తువులను ఉంచకూడదు. ఇంట్లో బీరువాను ఏమూలన, ఏ దిక్కున ఉంచాలి.. బీరువాలో ఉంచకూడని వస్తువులు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరువాను ఇంట్లో వాయువ్యం వైపు ఉంచాలి. ఈ దిక్కును చంద్రుడు పాలిస్తాడు. బీరువాను ఈ దిక్కున ఉంచడం వల్ల మన ఇంట్లోకి ధనం ఎక్కువగా వస్తుంది. ధన నష్టం తగ్గుతుంది. అలాగే బీరువాను దక్షిణ దిక్కున కూడా పెట్టుకోవచ్చు. బీరువా ముఖం ఉత్తరం వైపు ఉండేలా లేదా ఉత్తరం దిక్కున కూడా పెట్టుకోవచ్చు. ఉత్తరం దిక్కు అనేది కుబేర స్థానం. ఉత్తరం దిక్కుకు బుధుడు అధిపతి. బుధుడు సంపదకు అధిపతి. కనుక మనం బీరువాను ఉత్తరం దిక్కున కూడా పెట్టుకోవచ్చు.
అయితే బీరువాను నైరుతి వైపు మాత్రం అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ధనం అస్సలు నిలవదు. బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బు, నగలు, వెండి వస్తువులు, విలువైన పత్రాలు.. వంటి వాటినే ఉంచాలి. బట్టలను బీరువా కింద భాగంలో ఉంచాలి. బీరువా నుండి ఎప్పుడూ సువాసన వచ్చేలా చూసుకోవాలి. బీరువాకు ఒకవైపు డోర్ మీద స్వస్తిక్, ఓం, శ్రీ గుర్తులను వేసి ఉంచాలి. మరోవైపు లక్ష్మీ దేవి కి అటూ ఇటూ ఏనుగులు ఉన్న బొమ్మను పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అలాగే పూజ గదిలో ఈశాన్యం మూలన ఒక రాగి చెంబులో నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. పూజ గదిలో ఎప్పుడూ కామాక్షి దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. పూజ గదిలో, బెడ్ రూమ్ లో చీపురును ఉంచకూడదు. ఇంటిని కూడా ఈశాన్యం నుండి నైరుతి వైపు ఊడ్చుకోవాలి. చీపురు, చాటను కూడా ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంచకూడదు. ఈ నియమాలను పాటించడం వల్ల మన ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదని.. మనం లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.