Godhuma Rava Kesari : మనం ఆహారంగా తీసుకునే ధాన్యాలలో గోధుమలు కూడా ఒకటి. గోధుమలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోధుమలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గోధుమలను మనం పిండిగా, రవ్వగా చేసుకుని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ పిండితో చపాతీలను, రోటీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ రవ్వతో ఉప్మా ను ఎక్కువగా తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. గోధుమ రవ్వతో చేసే కేసరి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. గోధుమ రవ్వతో కేసరిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ రవ్వ – ఒక కప్పు , పంచదార – ఒక కప్పు, నెయ్యి – అర కప్పు, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 3 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చ కర్పూరం – చిటికెడు.
గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యిని వేసి కరిగిన తరువాత జీడిపప్పు పలుకులను, ఎండు ద్రాక్షను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో గోధుమ రవ్వను వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత 3 కప్పుల నీటిని పోసి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోధుమ రవ్వను పూర్తిగా ఉడికించుకోవాలి. గోధుమ రవ్వ ఉడికిన తరువాత పంచదారను వేసి పంచదార కరిగే వరకు కలిపి ఈ మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడిని, పచ్చ కర్పూరాన్ని, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ కేసరి తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ రవ్వ కేసరిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.