information

రైల్వే స్టేషన్ల పేర్ల చివ‌ర్లో జంక్ష‌న్‌, ట‌ర్మిన‌స్‌, సెంట్ర‌ల్ అని ఎందుకు ఉంటుందో తెలుసా..?

భార‌తీయ రైల్వే. మ‌న దేశంలో అతి పెద్ద ర‌వాణా సంస్థ ఇది. భార‌త ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డ‌ప‌బ‌డుతోంది. ప్ర‌పంచంలోనే మ‌న రైల్వే నెట్‌వ‌ర్క్ అతి పెద్ద రైల్వే నెట్‌వ‌ర్క్‌ల‌లో 4వ స్థానంలో ఉంది. మొత్తం 92,081 కిలోమీట‌ర్ల రైల్వే ట్రాక్ ఉంది. వీటి ద్వారా 66,687 కిలోమీట‌ర్ల దూరం క‌వ‌ర్ అవుతుంది. ఇక 2015-16 మ‌ధ్య కాలంలో 810 కోట్ల‌కు పైగా ప్ర‌యాణికులు దేశంలోని అనేక రైళ్ల‌లో ప్ర‌యాణించారు. అంటే ఆ గ‌ణాంకాల‌ను చూసుకుంటే రోజుకు దాదాపుగా ప్ర‌స్తుతం 2.2 కోట్ల మంది ప్ర‌యాణికులు రోజుకు రైళ్లలో ప్ర‌యాణం చేస్తున్న‌ట్టు లెక్క‌.

అయితే ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే… మ‌నం సాధార‌ణంగా కొన్ని రైల్వే స్టేష‌న్ల పేర్ల‌కు చివ‌ర్లో జంక్ష‌న్‌, ట‌ర్మిన‌స్‌, సెంట్ర‌ల్, కంటోన్మెంట్ అని చ‌దువుతాం క‌దా. కొన్నింటికి ఇలాంటి పేర్లు ఏవీ ఉండ‌వు. కేవ‌లం ఆ స్టేష‌న్ పేరు మాత్ర‌మే ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.

do you know the meaning of junction and terminus and central

1. ట‌ర్మిన‌స్‌

రైళ్లు ఇలాంటి స్టేష‌న్ల‌లోకి ఎంట‌ర్ అయ్యే దిశ‌లోనే మ‌ళ్లీ తిరిగి వెళ్లిపోతాయి. అంటే ట్రెయిన్స్ స్టేష‌న్‌లోకి వచ్చిన దిశ‌లోనే వెన‌క్కి తిరిగి వెళ్తాయి అన్న‌మాట‌. అంటే ఈ స్టేష‌న్ల‌లో రెండో వైపున‌కు ట్రాక్ ఉండ‌దు. అందుకే ఇలాంటి రైల్వే స్టేష‌న్ల‌ను ట‌ర్మిన‌స్ అని పిలుస్తారు. ఛ‌త్ర‌ప‌తి శివాజీ ట‌ర్మిన‌స్ (CST), లోక‌మాన్య తిల‌క్ ట‌ర్మిన‌స్ (LTT) వంటివి ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు.

2. సెంట్ర‌ల్

అత్యంత ర‌ద్దీగా ఉండే రైల్వే స్టేషన్ల‌ను సెంట్ర‌ల్‌గా పిలుస్తారు. ఈ స్టేష‌న్ల‌లో చుట్టు ప‌క్క‌ల మ‌రికొన్ని రైల్వే స్టేష‌న్లు కూడా ఉంటాయి. పెద్ద ఎత్తున రైళ్లు వ‌స్తుంటాయి. ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తుంటారు. అందుకే ఇలాంటి స్టేష‌న్ల‌ను సెంట్ర‌ల్ అని పిలుస్తారు. ముంబై సెంట్ర‌ల్ (BCT), చెన్నై సెంట్ర‌ల్ (MAS), ట్రివేండ్రం సెంట్ర‌ల్ (TVC), మంగ‌ళూర్ సెంట్రల్ (MAQ), కాన్పూర్ సెంట్ర‌ల్ (CNB) లు మ‌న దేశంలో ఉన్న సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్లు.

3. జంక్ష‌న్

ఏదైనా రైల్వే స్టేష‌న్‌లో 3 రూట్లు ఉంటే దాన్ని జంక్ష‌న్‌గా పిలుస్తారు. అంటే ఒక రూట్‌లో వ‌చ్చిన ట్రెయిన్ ఆ స్టేష‌న్ నుంచి వెళ్లేందుకు 2 రూట్లు ఉండాలి. దీంతో అలాంటి స్టేష‌న్ల‌ను జంక్ష‌న్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. మ‌న దేశంలో జంక్ష‌న్లుగా పిల‌వ‌బ‌డే రైల్వే స్టేష‌న్లు చాలానే ఉన్నాయి. కాజిపేట జంక్ష‌న్‌, విజ‌య‌వాడ జంక్ష‌న్‌, మ‌ధుర జంక్ష‌న్ ఇలా అన్న‌మాట‌.

4. కంటోన్మెంట్

రైల్వే స్టేష‌న్ల‌కు స‌మీపంలో ఆర్మీ అధికారుల హెడ్ క్వార్ట‌ర్లు, నివాసాలు ఉంటే అలాంటి స్టేష‌న్ల‌ను కంటోన్మెంట్ అని పిలుస్తారు. వెల్లూర్ కంటోన్మెంట్‌, బెంగుళూరు కంటోన్మెంట్ దీనికి ఉదాహ‌ర‌ణ‌లు.

5. స్టేష‌న్

పైన చెప్పిన నాలుగు కాని రైల్వే స్టేష‌న్ల‌ను వ‌ట్టి స్టేష‌న్లుగానే ప‌రిగ‌ణిస్తారు. వీటిలోకి ట్రెయిన్లు వస్తాయి. వెళ్తాయి. అవి ప్రయాణికుల‌వి లేదంటే గూడ్స్ ట్రెయిన్స్ ఏవైనా కావ‌చ్చు. ఇవి సాధార‌ణ రైల్వే స్టేష‌న్ల కోవ‌కు చెందుతాయి.

Admin

Recent Posts