Dondakaya Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో దొండకాయలు ఒకటి. దొండకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో దొండకాయ ఫ్రై కూడా ఒకటి. దొండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే దొండకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని చాలా సులభంగా, చాలా తక్కువసమయంలో తయారు చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి, సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా చేసుకోగలిగే ఈ దొండకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – 300గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దొండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా దొండకాయలను గుండ్రంగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత దొండకాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత దొండకాయ ముక్కలను మరోసారి కలిపి మూత పెట్టి దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. దొండకాయ ముక్కలు వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కొబ్బరి పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. వీటిని మరో 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన దొండకాయ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.