Dondakaya Perugu Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు ఒకటి. ఇతర కూరగాయల వలె దొండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా మనం ఆహారంగా తీసుకోవాలి. దొండకాయల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దొండకాయలతో వేపుడు, కూరలె కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. దొండకాయ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, సులభంగా దొండకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – రెండు ఇంచుల ముక్క, పచ్చిమిర్చి – 3, కొత్తిమీర – కొద్దిగా, నూనె -ఒక టేబుల్ స్పూన్, తాళింపు గింజలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, గుండ్రంగా తరిగిన దొండకాయలు – పావు కిలో, ఉప్పు – తగినంత, చిలికిన పెరుగు – 300 గ్రాములు, నీళ్లు – అర టీ గ్లాస్.
దొండకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా జార్ లో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత దొండకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. దొండకాయ ముక్కలను ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించాలి. తరువాత ఉప్పు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. దొండకాయ ముక్కలు చల్లారిన తరువాత పెరుగు, నీళ్లు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ పెరుగు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దొండకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు.