Off Beat

Doordarshan : దూర‌ద‌ర్శ‌న్ లోగో, ట్యూన్ వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదే..!

Doordarshan : ఇప్పుడంటే వందల ఛాన‌ల్ లు వచ్చాయి. పాటలకు ఒక ఛాన‌ల్, సినిమాలకు ఒక ఛానల్, కామెడీ సీన్లకు ఒక ఛానల్. స్పోర్ట్స్ కి ఒక ఛానల్. ఇలా ప్రతి ఒక్క అంశానికి ఒక్కో ఛానల్. కానీ ఒకప్పుడు అన్నింటికీ కలిపి ఒకటే ఛాన‌ల్, అదే దూరదర్శన్. ఈ తరానికి కాదుగానీ 80, 90 దశకాలు, అంతకు ముందు పుట్టిన వాళ్లకు సుపరిచితమైన చానల్ దూరదర్శన్. దూరదర్శన్ ట్యూన్, లోగో ప్రతీ ఒక్కరి మనసులో ప్రింటై ఉంటుంది. లాంగ్ షాట్ లో అంతరిక్షం మాదిరిగా తరంగాలు తిరుగుతూ తిరుగుతూ, చివరికి రెండు కళ్లమాదిరిగా వంకీలు క్లోజప్ లోకి వచ్చి ఫిక్సవుతాయి. కింద సత్యం శివం సుందరం. మధ్యలో దూరదర్శన్ టైటిల్.

మంద్రస్థాయిలో పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ స్వరపరిచిన ట్యూన్. నిద్రలో ఉన్నా సరే.. దూరదర్శన్ ట్యూన్ అని ఇట్టే చెప్పేయొచ్చు. వార్తలకైనా, వినోదానికైనా రేడియో మాత్రమే ఉన్న రోజుల్లో.. దూరదర్శన్ ప్రసారాలు సమాచార విప్లవంగా దూసుకొచ్చాయి. ప్రసార భారతిలో భాగంగా మొదట్లో చిన్న ట్రాన్స్ మిటర్, చిన్న స్టూడియోతో మొదలైన దూరదర్శన్.. నేడు ఇండియాలోనే అతిపెద్ద సమాచార వ్యవస్థగా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 15, 1959న ఢిల్లీలో ప్రారంభమై, 1965లో రోజు వారీ కార్యక్రమాల‌ను ప్రసారం చేసింది. మొదట ఆల్ ఇండియా రేడియోలో భాగంగా ప్రసారాలు వచ్చేవి. తర్వాత రేడియో నుంచి విడిపోయి 1972లో ముంబై, అమృత‌స‌ర్ నగరాల్లో సెపరేటుగా టెలికాస్ట్ చేసింది.

doordarshan logo and tune details who made them

90 శాతం పైగా భారతీయుల జీవితాలతో మమేకమైన దూరదర్శన్ లోగో రూపకర్త దేవాశిష్ భట్టాచార్య. రెండు కళ్లలా ఉండే లోగోని దేవాశిష్ అతని స్నేహితులు కలిసి డిజైన్ చేశారు. చైనీస్ ఫిలాసఫీ యిన్ అండ్ యాంగ్ సింబల్ మాదిరిగా ఉండే రెండు వంకీలతో రూపొందించారు. 1976లో పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అహ్మద్ హుస్సేన్ ఖాన్ తో ట్యూన్ కంపోజ్ చేయించారు. 80వ దశకం, 90వ దశకంలో లోగో డిజైన్ అప్ గ్రేడ్ చేశారు.

1975 వరకు దూరదర్శన్ ప్రసారాలు ఏడు సిటీల్లో మాత్రమే వచ్చేవి. తర్వాత మరో ఐదు రాష్ట్రాల్లో ప్రసారాలు విస్తరించాయి. 1982 ఏషియన్ గేమ్స్ ను తొలిసారి కలర్‌లో టెలికాస్ట్ చేశారు. 1400 ట్రాన్స్ మిటర్ల ద్వారా ప్రసారాలు ఇంటింటికీ అందుతున్నాయి. దేశవ్యాప్తంగా డీడీకి 67 కి పైగా స్టూడియోలు ఉన్నాయి. ప్రస్తుతానికి డీడీ నేషనల్, డీడీ న్యూస్ తో కలిపి వివిధ భాషలు, ప్రాంతీయ చానళ్లు కలుపుకుని 35 కి పైగానే ఉన్నాయి. 2003లో 24 గంటల న్యూస్ చానల్ ప్రారంభమైంది. 146 దేశాల్లో డీడీ ఇండియా ప్రసారమవుతోంది.

Admin

Recent Posts