Drumsticks Masala Curry : మునక్కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Drumsticks Masala Curry : మ‌న ఆరోగ్యానికి మున‌గ చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు. మున‌గ చెట్టులో ప్ర‌తి భాగం కూడా మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా చేయ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలోఇలా అనేక ర‌కాలుగా మున‌గ‌చెట్టు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌గ చెట్టుకు కాసే మున‌క్కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మున‌క్కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ మునక్కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా, సుల‌భంగా మున‌క్కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌క్కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మున‌క్కాయ‌లు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు – 2, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – కొద్దిగా, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్.

 Drumsticks Masala Curry recipe in telugu very tasty
Drumsticks Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌.

మున‌క్కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. త‌రువాత అందులోనే మ‌సాలా దినుసులు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా పొడిగా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మున‌క్కాయ ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, గ‌రం మ‌సాలా, మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

ఇలా వేయించిన త‌రువాత మున‌క్కాయ ముక్క‌లు, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌రో 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌ను చల్లి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మున‌క్కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా కూర‌ను కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts