Jonna Rotte : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం ఎక్కువయ్యిందనే చెప్పవచ్చు. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, శరీరంలో కోలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, జీర్ణశక్తిని పెంచడంలో జొన్నలు మనకు సహాయపడతాయి. ఈ జొన్నలతో ఎక్కువగా రొట్టెను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. జొన్న రొట్టె చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల చక్కటిఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే జొన్న రొట్టెను తయారు చేయడం చాలా మందికి రాదు. ఒకవేళ చేసినా కూడా అవి చల్లారగానే గట్టిగా అవుతూ ఉంటాయి. ఈ జొన్న రొట్టెలను సులభంగా, ఎక్కువ సమయం మెత్తగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – కొద్దిగా.
జొన్న రొట్టె తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పును కూడా వేసి నీటిని మరిగించాలి. నీళ్లు చక్కగా మరిగిన తరువాత జొన్న పిండిని వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పిండిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తరువాత చేతికి తడి చేసుకుంటూ పిండిని 5 నుండి 6 నిమిషాల పాటు బాగా వత్తుకోవాలి. తరువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి జొన్న పిండి వేసుకుంటూ చపాతీ కర్రతో వత్తుకోవాలి. జొన్న రొట్టెను చపాతీలా కాకుండా తక్కువ ఒత్తిడితో నెమ్మదిగా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తరువాత కావాలంటే అంచులను గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక జొన్న రొట్టెను వేసి అర నిమిషం పాటు కాల్చుకోవాలి. తరువాత రొట్టె పై వైపు తడి వస్త్రంతో రొట్టె అంతా తడి చేయాలి.
మరో అర నిమిషం పాటు కాల్చుకున్న తరువాత రొట్టెను మరోవైపుకు తిప్పి కాల్చుకోవాలి. జొన్న రొట్టె కాలడానికి ఎక్కువ సమయం పడుతుంది. కనుక దీనిని నిదానంగా రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వెజ్, నాన్ వెజ్ కూరలతో ఈ జొన్న రొట్టెను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన జొన్న రొట్టెను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ జొన్న రొట్టె ఎన్ని గంటల పాటు ఉన్నా కూడా మెత్తగానే ఉంటుంది. ఈ జొన్న రొట్టెను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.