Egg Burji : ఎక్కువ పోషకాలను తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. కోడిగుడ్లను ఉడికించి తీసుకోవడంతో పాటు వాటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో సులభంగా చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ బుర్జీ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇంకా కావాలని అడిగి మరీ తింటారు. కోడిగుడ్లతో ఈ రుచికరమైన వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బుర్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 6, నూనె – 5 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 1, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 4, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, , గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ బుర్జీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకోవాలి. తరువాత అందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత తగినంత ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కోడిగుడ్డు మిశ్రమాన్ని వేయాలి. దీనిని కదిలించకుండా అలాగే మూత పెట్టి ఉడికించాలి. కోడిగుడ్డు ఒక వైపు ఉడికిన తరువాత నెమ్మదిగా మరో వైపుకు తిప్పుకుని వేయించాలి. కోడిగుడ్డు ఉడికిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి మూత పెట్టి వేయించాలి.
కోడిగుడ్డు చక్కగా వేగి నూనె పైకి తేలిన తరువాత మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర చల్లి సట్వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బుర్జీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా ఎగ్ బుర్జీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.