Tooth Decay : మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పన్ను సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. పూర్వకాలంలో వందేళ్లు వచ్చినా కూడా దంతాలు ఆరోగ్యంగా ఉండేవి. కానీ నేటి తరుణంలో పిల్లల్లో కూడా మనం దంతాలు పుచ్చిపోవడాన్ని మనం గమనించవచ్చు. నోటిలో ఉండే క్రిములను చంపి దంతాలు పుచ్చిపోకుండా ఉండాలని మనం మార్కెట్ లో దొరికే రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటాం. ఎన్ని రకాల టూత్ పేస్ట్ లు వాడినప్పటికి దంతాలు పుచ్చిపోతూనే ఉంటాయి. అలాగే చాలా మంది రోజుకు రెండు సార్లు దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికి దంతాలు పుచ్చిపోతూ ఉంటాయి.
దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పంచదారతో చేసిన తీపి పదార్థాలు, చాక్లెట్లు, మైదా పిండితో చేసిన పదార్థాలు, శీతల పానీయాలు, టీ, కాఫీల వంటి వాటికి దూరంగా ఉండాలి. అయితే చాలా మంది ఇటువంటి ఆహారపదార్థాలు తినకుండా ఉండలేరు. ముఖ్యంగా పిల్లలు అస్సలు ఉండలేరు. ఇటువంటి పదార్థాలు తిన్నప్పటికి దంత క్షయం కాకుండా ఉండాలంటే చెరుకు ముక్కలను బాగా నమలాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత చెరుకు ముక్కలను తినడం వల్ల దంత క్షయం జరగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చెరుకు ముక్కలు నమలడం వల్ల దంతాలు, చిగుళ్లు తాజాగా ఉంటాయి. చెరుకును నమిలేటప్పుడు దీనిలో ఉండే ఫైబర్ దంతాలను, చిగుళ్లను శుభ్రపరుస్తుంది.
దంతక్షయానికి కారణమయ్యే చెడు బ్యాక్టీరియాలను నశింపజేసే యాంటీ ఆక్సిడెంట్లు చెరుకులో అధికంగా ఉంటాయి. అలాగే రోజులో సాధ్యమైనంత వరకు మొలకెత్తిన గింజలను, దానిమ్మ గింజలను, తాజా పండ్లు, కొబ్బరి, ఉడికించని స్వీట్ కార్న్ గింజలను, నారింజ తొనలను నమిలి తినాలి. ఇలా తినడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. దంతాలకు గారపట్టకుండా ఉంటుంది. వీటిని తినడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా నోట్లో ఉండే బ్యాక్టీరియాలు నశిస్తాయి. మన నోట్లో ఊరే లాలాజలమే క్రిమి సంహారక శక్తిని కలిగి ఉంటుందని ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చెరుకు ముక్కలను అలాగే సహజంగా లభించే పదార్థాలను ఎక్కవగా తినడం వల్ల దంతాలను పుచ్చిపోకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు, దంతాలు పుచ్చిన తరువాత బాధపడడం కంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.