Egg Puff Recipe : మనకు బేకరీల్లలో లభించే చిరుతిళ్లల్లో ఎగ్ పఫ్ లు కూడా ఒకటి. ఎగ్ పఫ్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. టమాట సాస్ తో తింటే ఎగ్ పఫ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ ఎగ్ పఫ్స్ ను బేకరీ స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఒవెన్ లేకుండా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. చాలామంది వీటిని ఇంట్లో తయారు చేసుకోవడం వీలు కాదని భావిస్తారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా సులభంగా ఎగ్ పఫ్స్ ను ఇంట్లోను తయారు చేసుకోవచ్చు. బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ పఫ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న బటర్ – 100 గ్రా., మైదాపిండి – 200 గ్రా. లేదా ఒక కప్పు, ఉప్పు – తగినంత, పంచదార – అర టీస్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్స్,
కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 2, నూనె – 3 టీ స్పూన్స్, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, గరం మసాలా -అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ పఫ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పంచదార, నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నొక్కుతూ 7 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ దీర్ఘచతురస్రాకారంలో షీట్ లాగా వత్తుకోవాలి. ఇప్పుడు బరట్ ను మూడు భాగాలుగా చేసి అందులో నుండి ఒక భాగాన్ని తీసుకుని మైదాపిండి షీట్ మీద రాయాలి.తరువాత ఈ షీట్ ను బుక్ ఫోల్డ్ పద్దతిలో అంచులను మూసివేయాలి. అనగా రెండు అంచులను మధ్యలోకి మడిచి మరలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని పైన తడి వస్త్రాన్ని కప్పి డీఫ్రిజ్ లో 20 నిమిషాల పాటు ఉంచాలి.
20 నిమిషాల తరువాత ఈ షీట్ ను బయటకు తీసి మరలా నెమ్మదిగా వత్తుకోవాలి. తరువాత పైన బటర్ ను రాసి ఫోల్డ్ చేసుకుని మరలా డీఫ్రిజ్ లో ఉంచాలి. 20 నిమిషాల తరువాత ఈ షీట్ ను బయటకు తీసి వత్తుకుని మిగిలిన బటర్ ను రాసి ఫోల్డ్ చేసుకుని ముందులాగే మరలా 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇప్పుడు కర్రీ తయారీ కోసం ఉడికించిన కోడిగుడ్లను నిలువుగా రెండు భాగాలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవివేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ షీట్ ను బయటకు తీసి రెండు భాగాలుగా కట్ చేసుకుని ఒక భాగాన్ని ఫ్రిజ్ లో ఉంచాలి. మిగిలిన షీట్ ను చతురస్రాకారంలో వత్తుకుని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిపై కర్రీని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ఉంచి వాటిపై కట్ చేసుకున్ గుడ్డు ముక్కలను తిరిగేసి ఉంచాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి కలపాలి. తరువాత పఫ్ రెండు అంచులకు ఈ పాలను రాసి మూసి వేయాలి. పఫ్ పైన కూడా ఈ పాలను బ్రష్ తో లేదా వస్త్రంతో రాసి కేక్ గిన్నెలోకి లేదా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ ను ఉంచి అందులో పఫ్ గిన్నెను ఉంచాలి. తరువాత మూత పెట్టి 30 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై బేక్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పఫ్ లను మరో వైపుకు తిప్పుకుని మరో 10 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పఫ్ లను ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఎగ్ పఫ్ లు తయారవుతాయి. ఫ్రిజ్ లో ఉంచిన పఫ్ పేస్ట్రీ నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. దీనితో ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఎగ్ పఫ్ లను తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా, రుచిగా ఎగ్ పఫ్ లను తయారు చేసుకుని తినవచ్చు.