Flax Seeds Karam Podi : మనం వంటింట్లో వివిధ రకాల కారం పొడులను తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది ముందుగా వీటితో భోజనం చేసిన తరువాతే కూరతో భోజనం చేస్తూ ఉంటారు. అయితే మనం ఆహారంగా తీసుకునే అవిసె గింజలతో కూడా మనం కారం పొడిని తయారు చేసుకోవచ్చు. అవిసె గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసేలా అవిసె గింజలతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజల కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
అవిసె గింజలు – ఒక కప్పు, పల్లీలు – అర కప్పు, మినపప్పు – పావు కప్పు, నువ్వులు – పావు కప్పు, ధనియాలు – పావు కప్పు, మిరియాలు – రెండు టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 15 నుండి 18, కరివేపాకు – ఒక కప్పు, చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 15.
అవిసె గింజల కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో అవిసె గింజలు వేసి మధ్యస్థ మంటపై దోరగా వేయించాలి. తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అద కళాయిలో పల్లీలు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మినపప్పు, నువ్వులు వేసి వేయించాలి. వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లాగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ముందుగా సిద్దం చేసుకున్న కారంలో వేసుకుని కలుపుకోవాలి.
దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల రుచిగా ఆరోగ్యానికి మేలు చేసే అవిసె గింజల కారం తయారవుతుంది. ఈ కారాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో మొదటి ముద్దను ఈ కారంతో తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.