Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్లను అమ్మాలనుకునే వారి కోసం ఓ సరికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. సెల్ బ్యాక్ పేరిట ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లను సులభంగా అమ్మవచ్చు. దీనివల్ల వినియోగదారులకు తమ పాత ఫోన్లకు సరైన ధర పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. అలాగే పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
దేశంలో రోజు రోజుకీ ఇ-వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని.. దీంతో పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుందని.. అందుకనే ఈ.. సెల్ బ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టామని ఫ్లిప్‌కార్ట్ తెలియజేసింది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ పాత ఫోన్లను సులభంగా అమ్మవచ్చని తెలిపారు. ఈ క్రమంలోనే వినియోగదారులు తాము అమ్మే ఫోన్లకు ఒక ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ గిఫ్ట్ వోచర్‌ను పొందుతారు.
ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫోన్‌ను విక్రయించాలంటే అందుకు కింద తెలిపిన స్టెప్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది.
1. ముందుగా ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
2, అందులో సెల్ బ్యాక్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అది యాప్ హోమ్ పేజ్ కింది భాగంలో ఉంటుంది.
3. మీ ఫోన్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. దీంతో ఫోన్ కండిషన్‌ను ముందుగా తెలుసుకుంటారు.
4. కన్‌ఫర్మేషన్ అయ్యాక 48 గంటల్లో ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఇంటికే వచ్చి మీ ఫోన్‌ను వెరిఫై చేసి తీసుకెళ్తారు.
5. వెరిఫికేషన్ అనంతరం మీకు ఇచ్చిన సెల్ బ్యాక్ వాల్యూ ప్రకారం ఫోన్‌కు చెందిన మొత్తాన్ని గిఫ్ట్ వోచర్ రూపంలో పంపిస్తారు. దాంతో ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ఏమైనా కొనుగోలు చేయవచ్చు.
ఇలా ఫ్లిప్‌కార్ట్ సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. దీన్ని దేశంలో ఉన్న 1700 పిన్‌కోడ్‌లలో అందుబాటులో ఉంచారు. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. మీకు సదుపాయం అందుబాటులో ఉందో, లేదో చెక్ చేసుకోవాలంటే.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఓపెన్ చేసి పరిశీలించాలి.