Proteins : ప్రోటీన్లు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్, మటన్, చేపలు. అయితే వాస్తవానికి శాకాహారం తినేవారికి కూడా ప్రోటీన్లు లభిస్తాయి. మనకు లభించే అనేక రకాల శాకాహారాల్లోనూ ప్రోటీన్లు లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే కొన్నింటిలో చికెన్, మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్లు లభిస్తాయి. అవును.. షాకవుతున్నా.. ఇది నిజమే. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
చికెన్, మటన్, చేపలు వంటి ఆహారాల కన్నా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే శాకాహారాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. వాటిల్లో సోయా గింజలు ఒకటి. 100 గ్రాముల చికెన్‌లో మనకు 28 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అదే మటన్ అయితే 26 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. ఇక సోయా గింజల్లో మనకు 31 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అంటే చికెన్, మటన్ కన్నా సోయా గింజల ద్వారానే మనకు ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయన్నమాట.
ఇక పెసలు, పప్పు దినుసులు, శనగలు, పచ్చి బఠానీలు, కాలిఫ్లవర్, చీజ్, పనీర్, గుమ్మడికాయ విత్తనాలు, పాలు, పెరుగు తదితర ఆహారాల్లోనూ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని 100 గ్రాముల మేర తీసుకుంటే సుమారుగా 10 నుంచి 30 గ్రాముల మధ్య ప్రోటీన్లు లభిస్తాయి.
కనుక చికెన్, మటన్ తినని వారు తమకు ప్రోటీన్లు లభించవని అనుకోకూడదు. వాస్తవానికి శాకాహారం తీసుకునే చాలా మంది కూడా సిక్స్ ప్యాక్ సాధించిన వారు ఉన్నారు. కనుక శాకాహారం తినేవారు ప్రోటీన్లు లభించడం లేదని అనుకోవద్దు. పైన తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే కావల్సినంత ప్రోటీన్లు లభిస్తాయి. దీంతో కండరాల నిర్మాణం, మరమ్మత్తులు జరుగుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శక్తి లభిస్తుంది. జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి.