Vastu Tips : వాస్తు శాస్త్రాన్ని నమ్మే వాళ్లు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఏది చేసినా వాస్తు ప్రకారమే చేస్తారు. ఇళ్లు, ఆఫీస్ వంటి వాటిని కూడా వాస్తు ప్రకారమే కడతారు. దీని కోసం వాస్తు శాస్త్రం తెలిసిన పండితులను సూచనలు అడుగుతారు. వాస్తు నియమాలను పాటించడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరడంతోపాటు ఇంట్లో ధన వర్షం కురుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. పురాతన కాలం నుండి మన భారతదేశంలో కొన్ని నియమాలను పాటిస్తున్నారు. వీటిని అనుసరించి జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఆ నియమాలను పాటించడం వల్ల జీవితంలో గౌరవప్రదమైన పేరును, మనఃశాంతిని పొందుతారు. పురాతన కాలం వారు ప్రకృతి వల్ల మరియు కాస్మోటిక్ ఎనర్జీ వల్ల జీవించేవారు. తరువాత వాస్తు శాస్త్రం అనుసరించడం మొదలు పెట్టారు. సృష్టి నియమాలను అనుసరించి వాస్తును అనుసరించడం మొదలు పెట్టారు. డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ దానిని నిలుపుకునే వారు కొందరే. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, దుబారా వంటి కారణాలతోపాటు వాస్తు దోషాలు కూడా డబ్బు వృథా అవ్వడానికి కారణం అవుతాయి. వాస్తు నియమాలను పాటించడం వల్ల మనం ధనవంతులం అవ్వవచ్చు. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎటువంటి వైర్లు, పోల్స్, ఇతర వస్తువులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈశాన్యం దిశలో బీరువాను ఉంచుకోవడం వల్ల ఎంత సంపాదించినా నిలవదు. ఎక్కువగా డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది. ఈ ప్రదేశంలో ఇంటిని విశాలంగా, శుభ్రంగా ఉంచడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అక్కడ దేవున్ని పూజించుకోవచ్చు. ఉత్తరం కుబేరునికి మంచి ప్రదేశం. సంపద పెరుగుతుంది. కనుక ఈ ప్రదేశాన్ని పాజిటివ్ గా ఉంచాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది.
మన ఇల్లు ఒక దేవాలయం వంటిది. ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత ప్రయోజనాలను పొందవచ్చు. ధనం, సంపద పెరగాలంటే ఇంటిని అన్నీ రకాలుగా సిద్దంగా ఉంచాలి. ఇంట్లో సంపద పెరగాలంటే ఈశాన్య ప్రదేశంలో ఇంటి పైన లేదా కింది భాగంలో వాటర్ ట్యాంక్స్ ఉండకూడదు. అలాగే ఎక్వేరియాన్ని కూడా సంపదకు పాజిటివ్ గా సూచిస్తారు. కాబట్టి అందంగా, చురుకుగా, ఆకర్షణీయంగా తిరిగే చేపలను ఎంపిక చేసుకుని ట్యాంక్ లో వదలాలి. నీటిని తరచూ మార్చుతూ ఉండాలి. ఫిష్ ట్యాంక్ లో చేపలు చురుకుగా తిరుగుతూ ఉంటే ఇంట్లో సంపద, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి.
అలాగే బెడ్ రూమ్ కిటికీలు రోజులో కనీసం 20 నిమిషాలైనా తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. కిటికీలు తెరవకపోవడం వల్ల ప్రతిరోజూ రాత్రి నెగెటివ్ ఎనర్జీతో నిద్రించాల్సి వస్తుంది. ఇలా జరిగితే భవిష్యత్తు సుఖంగా ఉండదు. మనం నిద్రించే బెడ్ కూడా నేలకు ఒక అడుగు ఎత్తులో ఉండాలి. అలాగే ఇంట్లో గడియారాలన్నీ పని చేసేలా చేసుకోవాలి. ఒకవేళ పని చేయకపోతే వాటిని బాగు చేయడమో, పడేయడమో చేయాలి. గడియారం పనిచేయకపోతే ఆర్థికంగా స్థిరంగా ఉండలేరు. ఆలస్యంగా తిరిగే గడియారాలన్నీ డ్యూ డేట్స్ కు సంకేతంగా సూచిస్తూ ఉంటాయి.
ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. పాజిటివ్ ఎనర్జీ అయినా, నెగెటివ్ ఎనర్జీ అయినా ఇంటి ప్రధాన ద్వారం గుండానే ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లోకి గాలి, వెలుతురు ఎక్కువగా వస్తూ ఉండాలి. కిటికీలు, తలుపులు శుభ్రంగా ఉండాలి. వాటిని వీలైనంత ఎక్కువ సేపు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. ఇంట్లో ఉండే వినాయకుడి విగ్రహం ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తుంది. అయితే ఈ వినాయకుడి విగ్రహాన్ని ఈశాన్య ప్రదేశంలో ఉంచకూడదు. అదే విధంగా బాత్ రూమ్ లో మొక్కలను ఉంచడం చాలా మంచిది.
పగిలిన అద్దాలను, పని చేయని ఎలక్ట్రిక్ వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు. ఇంట్లో లాకర్ లను దక్షిణ గోడకు ఉంచాలి. కిటికీలకు, తలుపులకు ఉండే అద్దాలను శుభ్రంగా ఉంచాలి. ఇవి శుభ్రంగా లేకపోతే సంపదను అడ్డుకుంటాయి. బాల్కనీ ప్రాంతంలో బర్డ్ బాత్ ను లేదా పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. ఇంటి డ్రైనేజి పైపులను తూర్పు దిక్కున లేదా ఉత్తర దిక్కున ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రదేశంలో గుంతలు, మరమ్మత్తులు లేకుండా చూసుకోవాలి. ఈ వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనవంతులుగా అవుతారని నిపుణులు చెబుతున్నారు.