Garlic Gravy : మనం వంటల్లో వెల్లుల్లిని విరివిగా వాడుతూ ఉంటాము. వెల్లుల్లి వంటలకు చక్కటి రుచిని తీసుకురావడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇలా వంటల్లో వాడడంతో పాటు వెల్లుల్లితో మనం మసాలా కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లితో చేసే ఈ మసాలా కారం చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా వెల్లుల్లితో మసాలా కారాన్ని తయారు చేసుకుని తినవచ్చు. బ్యాచిలర్స్, అసలు వంటరాని వారు కూడా ఈ మసాలా కారాన్ని తేలికగా 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లితో ఎంతో రుచికరమైన మసాలా కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి మసాలా కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లిపాయ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – పావు కప్పు, పెరుగు – పావు కప్పు.
వెల్లుల్లి మసాలా కారం తయారీ విధానం..
ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసేసి రోట్లో వేసి మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. వీటిని వేయించిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి పెరుగు వేసి కలపాలి. పెరుగు ఉండకట్టకుండా బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి మసాలా కారం తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.