Vitamins For Eyes : కంటి చూపు బాగుండాలంటే.. ఈ విట‌మిన్లు అవ‌స‌రం..!

Vitamins For Eyes : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. క‌ళ్ల ప్రాముఖ్య‌త గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌నం శ‌రీర ఆరోగ్యం గురించి శ్ర‌ద్ద తీసుకున్నట్టే మ‌నం క‌ళ్ల ఆరోగ్యం గురించి కూడా త‌గిన శ్ర‌ద్ద తీసుకోవాలి. కానీ మ‌న‌లో చాలా మంది క‌ళ్ల ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. దీంతో కంటిచూపు త‌గ్గ‌డంతో పాటు కంటి పొర‌లు, క‌ళ్లు మండ‌డం, క‌ళ్లు పొడిబార‌డం, కంటి నుండి నీరు కార‌డం, రేచీక‌టి వంటి అనేక రకాల కంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇటువంటి కంటి సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉండాల‌న్న ఉన్న స‌మ‌స్య‌లు త‌గ్గాల‌న్నా మ‌నం కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల‌ను తీసుకోవాలి. మ‌న క‌ళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉండాల‌న్నా మ‌నం ముఖ్యంగా 6 ర‌కాల విట‌మిన్స్ ను తీసుకోవాలి. ఈ విట‌మిన్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

కంటిచూపు పెరుగుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే విట‌మిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంటిఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ ఎ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. రెటీనాలో రోడాప్సి ఉత్ప‌త్తిని పెంచి కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ ఎ ముఖ్య పాత్ర పోషిస్తుంది. విట‌మిన్ ఎ ఎక్కువ‌గా చీజ్, కోడిగుడ్లు, చేప‌లు, పాలు, పెరుగు, కాలేయం, క్యారెట్, ఆకుకూర‌లు, వంటి ఆహారాల్లో విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ ఎ ల‌భిస్తుంది. దీంతో కంటిచూపు మెరుగుప‌డుతుంది. అయితే ఈ విట‌మిన్ ఎ ను పురుషులు రోజుకు 700 మైక్రోగాములు, స్త్రీలు 600 మైక్రో గ్రాముల మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. అలాగే కంటి ఆరోగ్యాన్ని పెంచ‌డంలో విట‌మిన్ సి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది.

Vitamins For Eyes take these foods daily for many benefits
Vitamins For Eyes

ఈ పండ్ల‌ల్లో ఉండే విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌ని చేసి శ‌రీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను న‌శింజేస్తాయి. దీంతో వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే కంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. నారింజ పండ్ల‌ను తిన‌డం, నారింజ పండ్ల జ్యూస్ తాగ‌డం అలాగే స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్రొకోలి వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భించి క‌ళ్ల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇక కంటి ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో విటమిన్ ఇ కూడా ఒక‌టి. కంటిపొర‌లు, మ్యాక్యుల‌ర్ డిజెన‌రేష‌న్ వంటి కంటి స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో విటమిన్ ఇ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది.

విట‌మిన్ ఇ ఎక్కువ‌గా బాదంప‌ప్పు, చియా విత్త‌నాలు, పొద్దుతిరుగుడు గింజ‌లల్లో ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల కంటిఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇక కంటికి ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే ర‌క్త‌నాళాలు గట్టిప‌డ‌కుండా చేసి కంటికి ర‌క్తాన్ని చ‌క్క‌గా స‌ర‌ఫ‌రా చేయ‌డంలో కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ కె మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. విట‌మిన్ కె ఎక్కువ‌గా పాల‌కూర‌, తోట‌కూర‌తో ఇత‌ర ఆకుకూర‌ల్లో కూడా ఎక్కువ‌గా ఉంటుంది. రోజూ ఏదో ఒక ఆకుకూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే కళ్లు పొడిబార‌కుండా, క‌ళ్ల‌ల్లో త‌గినంత తేమ ఉండేలా చేయ‌డంలో మ‌న‌కు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌య‌సుపైబ‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే కంటి స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

గుడ్లు, సాల్మ‌న్ చేప‌లు, ట్యూనా చేప‌ల వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. అదే విధంగా శ‌రీరంలో విట‌మిన్ బి 12 లోపించ‌డం వ‌ల్ల కూడా కంటిచూపు మంద‌గిస్తుంది. క‌నుక మ‌నం విట‌మిన్ బి12 ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. విట‌మిన్ బి12 ఎక్కువ‌గా మాంసం, చేప‌లు, పాలు, పాల ప‌దార్థాలు, గుడ్లువంటి ఆహారాల్లో ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో కూడా ఈ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Share
D

Recent Posts